Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నంబర్ టూ గా వ్యవహరించే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వైసీపికి రాజీనామా చేశారు. ఆయనతో పాటూ నలుగురు కార్పొరేటర్లు, పలువురు మైనార్టీ నేతలు కూడా వైసిపికి గుడ్ బై చెప్పారు. దీనిపై రూప్ కుమార్ యాదవ్ బుధవారం జగనన్న భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటించారు. గత ఏడాదిన్నరగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఎంతో భాధించాయని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం తన రక్తాన్ని చెమటగా మార్చి పనిచేశానని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపి ఆవిర్భావం నుండి నేటి వరకూ పార్టీనే మొదటి ప్రాధాన్యతగా భావించి పనిచేశానని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఎన్నికల సందర్భంలో పనిచేసినట్లు గుర్తు చేశారు. పార్టీని వీడటం బాధాకరమే అయినే మార్పు అనీవార్యమని రూప్ కుమార్ యాదవ్ వెల్లడించారు. తనను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. వైసిపి నెల్లూరు సిటీ అభ్యర్ధిగా ఖలీల్ అహ్మద్ ను ప్రకటించినందుకు తనకు బాధలేదని, పార్టీని వీడటానికి అది కారణం కాదని వివరణ ఇచ్చారు. ఖలీల్ తనకు చిన్ననాటి నుండి మిత్రుడని పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతానన్నారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి రూప్ కుమార్ యాదవ్ మార్చి 2వ తేదీనా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే.
