విపిఆర్ నివాసం వద్ద కోలాహలం : భారీగా తరలివస్తున్న నేతలు

Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మార్చి 2వ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలియజేస్తూ వేల మంది ఆయన నివాసానికి తరలివస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది వైసికిని వీడి వేమిరెడ్డితో కలిసి నడిచేందుకు ముందుకు వస్తున్నారు. వీరే కాకుండా జిల్లాలోని టిడిపి నేతలు కూడా ఆయన్ను విడివిడిగా కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. సోమవారం నాడు సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని నెలవల విజయశ్రీ ప్రభాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలశారు. తండ్రి నెలవల సుబ్రమణ్యంతో కలిసి నెల్లూరులో వేమిరెడ్డిని కిలిసిన ఆమె ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి దినేష్ రెడ్డి, నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డిలు కూడా వేమిరెడ్డిని కలిశారు. కోవూరు నియోజకవర్గంలోని టిడిపి నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ప్రభాకర్ రెడ్డి నివాసానికి చేరుకున్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి… వేమిరెడ్డికి సంఘీభావం ప్రకటించారు. నియోజకవర్గ టిడిపి నేతలను వేమిరెడ్డికి పరిచయం చేశారు. నెల్లూరు 53వ డివిజన్ వైసీపి కార్పొరేటర్ దేవరకొండ సుజాత కూడా వేమిరెడ్డిని కలిసి తన సంఘీభావాన్ని తెలియజేశారు. భర్త దేవరకొండ అశోక్ తో కలిసి విపిఆర్ ను కలిసిన సుజాత మీతోనే తమ ప్రయాణం అంటూ స్పష్టం చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జొన్నవాడ ఆలయ మాజీ ఛైర్మైన్ పుట్టా సుబ్రమణ్యం దంపతులు కూడా వేమిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి వేమిరెడ్డి దంపతులను సత్కరించారు. తమ మద్దతు మీకే అంటూ వెల్లడించారు. లేగుంటపాడు, జమ్మిపాళెం, సీతారామపురం, మోడేగుంట గ్రామాలకు చెందిన పలువురు గ్రామస్తులు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వారి నివాసంలో కలిసి మద్దతు తెలియజేశారు. నెల్లూరు 54వ డివిజన్ కు చెందిన పలువురు మైనార్టీలు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసి తమ మద్దతును తెలియజేశారు. ఇకపై మీతో కలిసి ప్రయాణం చేస్తామని పేర్కొన్నారు. 46వ డివిజన్ కు చెందిన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మంజుల రెడ్డి, ఆమె భర్త మణికుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దశరథరామిరెడ్డి, శోభన్ బాబు తదితరులు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసి తమ మద్దతును తెలియజేశారు.

Read Previous

అభివృద్ధి లేకపోతే భవిష్యత్తే ఉండదు : ప్రచారంలో నారాయణ వెల్లడి

Read Next

నెల్లూరు ఫారెక్స్ సంస్థను ప్రారంభించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published.