Clock Of Nellore ( Nellore ) – ప్రజల స్పందన చూస్తుంటే త్వరలో జరిగే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి తన భర్త పొంగూరు నారాయణ లక్ష మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆయన సతీమణి పొంగూరు రమాదేవి ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 39వ డివిజన్ మూలాపేట, రాజాగారివీధిలో ఆదివారం ఆమె ప్రచారం నిర్వహించారు. స్థానిక జనసేన, టిడిపి కార్యకర్తలతో కలిసి గడప గడపకూ తిరిగారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేసి వచ్చే ఎన్నికల్లో నారాయణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే నగరంలో నిలిచిపోయిన భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా తమ ఓటు నారాయణకే అంటున్నారని, ప్రజల స్పందన చూస్తుంటే నారాయణ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు నగరంలో భూ గర్భ డ్రైనేజీ పనులు 90 శాతం పూర్తి చేశారని, మిగిలిన 10 శాతం పనులు వైసీపి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. భూ గర్భ డ్రైనేజీ పనులు పూర్తయి ఉంటే దోమలు లేని నగరంగా నెల్లూరు మారేదని గుర్తు చేశారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ప్రభుత్వం రాగానే నెల్లూరులో మిగిలిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని రమాదేవి స్పష్టం చేశారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు, నారాయణ నెల్లూరులో వేల ఇళ్లు నిర్మిస్తే వైసీపి ప్రభుత్వం వాటిని పేదలకు ఇవ్వకుండా మానసికంగా వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి ప్రభుత్వం రాగానే టిడ్కో ఇళ్ల సముదాయాల్లో అన్నీ వసతులు కల్పించి వాటిని పేదలకు అప్పగిస్తామన్నారు. ఈ ప్రచారం కార్యక్రమంలో అన్నంగి ప్రసాద్, సుజనా, గోపిక, మురళీ మోహన్, గడియారం మురళి తదితరులు పాల్గొన్నారు.
