టిడిపి శాంతి ర్యాలీ జరిగేనా ? – అనుమతి లేదన్న పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో బుధవారం సాయంత్రం నెల్లూరులోని విఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకూ శాంతియుత ర్యాలీ జరగాల్సి ఉంది. దీనిపై రెండు రోజుల క్రితమే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారని కూడా మీడియాకు వెల్లడించారు. మరో వైపు ఈ ర్యాలీపై పోలీసులు స్పందించారు. టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ ర్యాలీకి అనుమతి కోరుతూ ధరఖాస్తు చేశారని అయితే తాము ర్యాలీకి అనుమతి ఇవ్వడం లేదని నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ర్యాలీ జరిగే ప్రదేశానికి చెందిన చిన్నబజార్ పోలీసు స్టేషన్ సిఐ అశోక్ బాబు కూడా దీనిపై స్పందించారు. నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎలాంటి ర్యాలీకి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ర్యాలీ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు హెచ్చరిస్తున్నా టిడిపి నేతలు మాత్రం ర్యాలీ చేసి తీరుతామంటూ అంటున్నారు. మరో వైపు ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు టిడిపి నేతలను గృహ నిర్భంధాలు చేస్తున్నారు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితర నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఇంటి వద్ద, కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే పోలీసుల గురించి ముందుగానే తెలుసుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏ క్షణమైనా విఆర్సీ సెంటర్ లేదా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కార్యకర్తలతో ప్రత్యక్షమయ్యి నిరసన తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. నిరసన ర్యాలీని భగ్నం చేసేందుకు పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోసం గాలింపు చేపట్టారు. ర్యాలీ జరుగుతుందా లేదా అన్నది సాయంత్రం వరకూ వేచిచూడాలి మరీ.

Read Previous

ధైర్యంగా ఉండండి… వచ్చేది టిడిపి ప్రభుత్వమే… ఎమ్మెల్యే కోటంరెడ్డి భరోసా

Read Next

వెంకటగిరిలో మొదలైన జాతర సందడి : రేపు ఊరేగింపు, నిమజ్జనం

Leave a Reply

Your email address will not be published.