Clock Of Nellore ( Venkatagiri ) – తిరుపతిజిల్లాలోని వెంకటగిరి పట్టణంలో పోలేరమ్మ అమ్మవారి జాతర మొదలైంది. ఈనెల 1వ తేదీన ఘటోత్సవాన్ని వైభవంగా నిర్వహించిన అధికారులు, నిర్వాహకులు అసలు ఘట్టమైన అమ్మవారి నిలుపు, ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ్టి నుండి పట్టణంలో జాతర సందడి ఆరంభమైంది. అమ్మవారి విగ్రహాం తయారయ్యి, గురువారం తెల్లవారుజామున ఆలయానికి చేరుకునే అవకాశం ఉంది. గురువారం నిలుపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం వరకూ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తారు. సాయంత్రం పోలేరమ్మ అమ్మవారి విగ్రహాన్ని పట్టణంలో ఊరేగింపు నిర్వహించి అనంతరం నిమజ్జనం చేయనున్నారు. పోలేరమ్మ జాతరకు భక్తులు లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గ వైసీపి ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లు సాగుతున్నాయి.