- ఈనెల 29న ప్రపంచ గుండె దినోత్సవం
- వ్యాయామం, మంచి జీవనశైలితో గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చునని వెల్లడి
- అవగాహన ద్వారా 80 శాతం గుండె సమస్యలు పరిష్కారమవుతాయని వెల్లడి
Clock Of Nellore ( Nellore ) – నిత్యం వ్యాయామం, మంచి జీవనశైలి ద్వారా గుండె సంభందిత సమస్యలకు దూరంగా ఉండవచ్చునని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీనా వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నెల్లూరులోని అపోలో హాస్పిటల్ లో కన్సల్ టెంట్ కార్డియో తొరాసిక్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ ఎస్. విజ్ఞా చరణ్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాం సతీష్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2011వ సంవత్సరం నుండి ప్రతీ ఏడాది సెప్టెంబర్ 29వ తేదీనా వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా 50 శాతం వరకూ గుండె వ్యాధులను నివారించడమే దీని ప్రధాన ధ్యేయమని వెల్లడించారు. నిత్యం వ్యాయామం చేయడం, మంచి జీవనశైలిని అనుసరించడం ద్వారా గుండె సంభందిత సమస్యలకు దూరంగా ఉండవచ్చునని డాక్టర్ భక్తవత్సల రెడ్డి తెలియజేశారు. ఆహారంలో ఆకుకూరలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలని, మానసిక ఒత్తిడికి గురికాకుండా యోగా, ధ్యానం వంటివి చేయాలన్నారు. మద్యపానం, ధూమ పానానికి దూరంగా ఉండాలని సూచించారు. మాంసం, పాలు, గుడ్లు, ఫాస్ట్ ఫుడ్స్, అధిక చక్కెర కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదన్నారు. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యాలు తీసుకోవాలని డాక్టర్ భక్తవత్సల రెడ్డి తెలిపారు. కనీసం ఏడాదికి ఒక్క సారైనా గుండె సమస్యలకు సంభందించిన పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాం సతీష్ మాట్లాడుతూ నెల్లూరు అపోలో హాస్పిటల్ లో గుండె సంభందిత రోగాలకు అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటులో ఉండటమే కాకుండా ప్రపంచ స్థాయి వైద్య పరికరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అపోలో హాస్పిటల్ లో బీపి, షుగర్, ఈసీజి పరీక్షలను పూర్తి ఉచితంగా చేస్తున్నట్లు తెలియజేశారు. గుండె సంభందిత రోగులు అపోలో హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
టౌన్ హాల్ లో అవగాహన సదస్సు !
మరోవైపు వరల్డ్ హార్ట్ డే ను పురస్కరించుకుని గురువారం సాయంత్రం నెల్లూరులోని టౌన్ హాల్లో అపోలో హాస్పిటల్ సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి ప్రజల కోసం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గుండె వ్యాధులపై ప్రజలు అడిగిన పలు సందేహాలకు డాక్టర్ భక్తవత్సల రెడ్డి సమాధానాలు ఇస్తూ గుండె వ్యాధులు ప్రాణాంతకమైనవని, వాటి గురించి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని అన్నారు. అందుకే తాను ప్రతీ ఏడాది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తరచుగా పరీక్షలు చేయించుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవడం, అధిక రక్తపోటును నియంత్రించుకోవడం, మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం, ధూమ పానానికి దూరంగా ఉంటే గుండె వ్యాధులు దరిచేరవని డాక్టర్ భక్తవత్సల రెడ్డి స్పష్టం చేశారు.