Clock Of Nellore ( Nellore ) – వైద్య సేవల రంగంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన నెల్లూరు అపోలో స్పెషాలిటి హాస్పిటల్ మరో కీర్తిని సొంతం చేసుకుంది. అతి తక్కువ కాలంలో 100 రోబోటిక్ మోకాలి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన గుర్తింపును పొందింది. ఆర్ధోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్ మరియు రోబోటిక్ నీ సర్జరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి… డాక్టర్ వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి, డాక్టర్ పమ్మి కార్తీక్ రెడ్డి బృందం ఈ ఘనతను సొంతం చేసుకుంది. సాధారణంగా అయితే మోకాలి శస్త్ర చికిత్సల్లో వైద్యులు సాంప్రదాయ సాధనాలపై ఆధారపడతారు. ఇందుకోసం ప్రత్యేక శస్త్ర చికిత్స పరికరాలను ఉపయోగించి, మోకాలి మార్పడి అమరికను అంచనా వేసి శస్త్ర చికిత్స చేస్తుంటారు. ఇది పూర్తిగా వైద్యుని నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే నెల్లూరు అపోలో హాస్పిటల్ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన రోబోటిక్స్ సర్జరీ ద్వారా త్రీడి సీటి ఆధారిత వర్చువల్ ప్లాన్ సహాయంతో వైద్యుడు ఓ ప్రణాళికా బద్దంగా శస్త్ర చికిత్స చేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఎముకల్లో ఉన్న లోపాలు కూడా తెలుస్తాయి. ప్రధానంగా ఖచ్చితత్వంగా శస్త్ర చికిత్స చేయవచ్చు. అంతే కాకుండా శస్త్ర చికిత్స సమయంలో రోగి ఇతర కణజాలాలు దెబ్బతినవు. గాయం శాతం కూడా తగ్గి, త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుంది. సాంప్రదాయ పద్దతులతో పోలిస్తే ఈ రోబోటిక్స్ శస్త్ర చికిత్స ఎంతో సురక్షితం. నెల్లూరు ప్రజలకు ఇదో వరం.
అతి తక్కువ కాలంలో 100 రోబోటిక్ మోకాలి శస్త్ర చికిత్సలు పూర్తి చేసిన సందర్భంగా నెల్లూరులోని అపోలో హాస్పిటల్ లో ఆదివారం రోబోటిక్ నీ సర్జరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి ఆయన వైద్య బృందం, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాం సతీష్, హాస్పిటల్ సి.ఈ. ఓ నవీన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎప్పటికప్పుడు మారుతున్న వైద్య ప్రమాణాలకు అనుగుణంగా నెల్లూరు అపోలో హాస్పిటల్ లో కూడా అత్యాధునిక వైద్య పరికరాను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. అంతే కాకుండా తాము కూడా వైద్య వృత్తిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ తీసుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. అలాంటి ప్రామాణికాలతో ముందుకు సాగుతున్నాము కాబట్టే అతి తక్కువ కాలంలో 100 రోబోటిక్ మోకాలి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు.
రోబోటిక్ నీ సర్జరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రోబోటిక్ సర్జరీ ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో ఓ విప్లవాత్మం అని అన్నారు. రోబోటిక్ విధానం ద్వారా మోకాలు, తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలను అధిక ఖచ్చితత్వంతో చేయవచ్చునని చెప్పారు. అన్నీ రకాల రోబోటిక్ టెక్నాలజీలు ఒకేలా ఉండవని చెబుతూ మార్కెట్ లో వివిధ రోబోటిక్ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని, ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయని వెల్లడించారు. రోబోటిక్ విధానంలో శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకునే వారు ముందుగా ఆయా హాస్పిటల్ చరిత్రతో పాటూ ఎఫ్.డి.ఐ ఆమోదం, క్లినికల్ లెగసీ, గతంలో ఆయా హాస్పిటల్ లో జరిగిన రోబోటిక్స్ సర్జరీల వివరాలు తెలుసుకోవడం మంచిదని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ ఖచ్చితత్వంతో కూడిన రోబోటిక్స్ విధానం ద్వారా శస్త్ర చికిత్సలను నిర్వహిస్తుందని, అతితక్కువ కాలంలోనే 100 రోబోటిక్ మోకాలి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడిస్తూ తన వైద్య బృందానికి అభినందనలు తెలియజేశారు.
Reporter – Gopinath. K