Clock Of Nellore ( Nellore ) – ప్రతి ఒక్కరూ మెరుగైన ఆరోగ్యం కోసం మంచి పోషక విలువలు కలిగిన సీ ఫుడ్ ను విరివిగా తీసుకుని, ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో 3వ సీ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన మంత్రి, స్టాళ్లను సందర్శించారు. మంత్రితో పాటు జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఆఫ్కాఫ్ చైర్మన్ అనిల్ బాబు, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మట్ స్టాళ్లను సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రదర్శనశాలల్లో వివిధ రకాల చేపలు, రొయ్యలు, పీతల ప్రదర్శన, ఆహారపదార్థాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఆరోగ్యంగా జీవించేందుకు ప్రోటీన్లు కలిగిన సముద్ర ఉత్పత్తుల ఆహారాన్ని విరివిగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫిష్ ఆంధ్ర పేరుతో అవుట్లెట్లను ఏర్పాటుచేసి మత్స్య సంపద విక్రయాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ వలన అనేక రకాల మత్స్య సంపద ఆహార పదార్థాల వినియోగంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన, ఎలా వినియోగించుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి అన్న విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలుగుతుందన్నారు. దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఆక్వా రైతులకు ముఖ్యమంత్రి అన్ని విధాల ప్రోత్సాహకం అందిస్తున్నారని, ఒక యూనిట్ విద్యుత్ ను ఒకటిన్నర రూపాయికే సబ్సిడీపై అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అన్ని విధాల సహకరిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ కూడా మత్స్య ఉత్పత్తులపై అవగాహన కలిగి, విరివిగా తమ ఆహారపు అలవాట్లలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, మెరైన్ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, డి ఎల్ డి ఏ చైర్మన్ విజయ్ కుమార్, భూమి ఆర్గానిక్స్ ఎండి రఘురాం, ఎన్ ఎఫ్ డి బి సీనియర్ ఎగ్జిక్యూటివ్ భార్గవి, సభ్యులు పోలయ్య, నాబార్డ్ డీడీఎం రవి సింగ్, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, ఆక్వా రైతులు, తదితరులు పాల్గొన్నారు.
