Clock Of Nellore ( Kavali ) – కావలి నియోజకవర్గ అభివృద్ధికి 150 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం నెల్లూరుజిల్లా కావలిలో చుక్కల భూములకు సంభందించిన రైతులకు భూ హక్కులు కల్పించే కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సిఎం జగన్ ముఖ్య అతిధిగా హాజరయ్యి చుక్కల భూములకు మోక్షం కల్పించారు. ఈ సభలో భాగంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటూ నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు పనులను వాటికి కావాల్సిన నిధులను సిఎం దృష్ఠకి తీసుకెళ్లారు. ఎన్నికల లోపు వాటిని పూర్తి చేయాలని సిఎంని అభ్యర్ధించారు. అనతంరం సభలో ప్రసంగించిన సిఎం జగన్ తన ప్రసంగం చివర్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరిన అంశాలను గుర్తు చేశారు. ఎమ్మెల్యే కోరిక మేరకు కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు 35కోట్లు, సంగం బ్యారేజీ నుండి కావలికి నీటిని తరలించే లింక్ కెనాల్ కు 20 కోట్లు, ట్రంక్ రోడ్డు నిర్మాణానికి అదనంగా 15 కోట్లు, ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 80 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
