Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు గుర్రాలమడుగు సంఘంలో రెండు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన ఏడాదిన్నర చిన్నారి ఉదంతం విషాదాంతమైన విషయం తెలిసిందే. ఆ చిన్నారి వారి నివాసం పక్కనే ఉన్న సర్వేపల్లి కాలువలో విగత జీవిగా కనిపించింది. ఈ కేసులో తల్లే ముద్దాయి అని పోలీసులు నిర్ధారించి ఆమెను బుధవారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వివరాల్లోకి వెళితే గుర్రాలమడుగు సంఘానికి చెందిన అనూష అనే యువతికి ఆమె సమీప బంధువైన మణికంఠకు కొద్ది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. భర్త రాపూరులో హోటల్ నిర్వహిస్తుండగా అందరూ ఒకప్పుడు అక్కడే ఉండే వారు. అయితే చదువులో ముందుండే అనూష తాను మంచి స్థాయికి వెళ్లాలని నెల్లూరులో పుట్టింటికి వచ్చి విద్యనభ్యసిస్తుంది. ఏడాదిన్నర వయస్సుండే రెండో కుమార్తె ఆమె వద్దే ఉంటుంది. ఈ క్రమంలో తన ఎదుగుదలకు వివాహం, కుమార్తె అడ్డుగా ఉన్నాయని భావించిన అనూష రెండు రోజుల క్రితం ఊయలలో ఉన్న కుమార్తెను పక్కనే ఉన్న సర్వేపల్లి కాలువలో పడేసింది. గంట తర్వాత తన కుమార్తె కనపడటం లేదని, ఎవరో కిడ్నాప్ చేశారని కట్టు కథ అల్లి స్థానికులను నమ్మించింది. ఘటనా స్థలానికి చేరుకున్న బాలాజీనగర్ పోలీసులు చిన్నారి కోసం గాలించారు, అలాగే స్థానికంగా ఉన్న సిసి టివి కెమరాలను పరిశీలించారు. అయితే ఎక్కడా కిడ్నాపర్లు వచ్చినట్లు నిర్ధారణ కాలేదు. దీంతో అనూషను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె అసలు విషయం బయటపెట్టింది. తాను బాగా చదువుకుని పెద్ద స్థాయికి వెళ్లాలని, అందుకు కుమార్తె అడ్డుగా ఉందని, తానే సర్వేపల్లి కాలువలో కుమార్తెను పడేశానని చెప్పగా.. పోలీసులు కాలువలో గాలించగా చిన్నారి మృతదేహం లభించింది. దీంతో బాలాజీనగర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి ఇవాళ జైలుకు పంపారు. దీనిపై నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
