నెల్లూరుజిల్లాలో 4.25 లక్షల ఎకరాలకు సాగునీరు – ఐఏబి సమావేశంలో మంత్రి కాకాణి ప్రకటన

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు 46 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం, జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. తొలుత రెండో పంటకు సంబంధించి సోమశిల, కండలేరు జలాశయాల్లో నిల్వ ఉన్న నీటి పరిమాణం, కనుపూరు కాలువ, కావలి కాలువ, జీకేఎన్ కాలువ, దక్షిణ కాలువ వంటి ప్రధాన కాలువలకు సాగునీటి విడుదలకు ప్రతిపాదించిన నీటి పరిమాణం వంటి వివరాలను ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణ మోహన్ వివరించగా, జిల్లాలో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న సేవలు, ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు సంబంధించి చేపడుతున్న నష్ట నివారణ చర్యలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రాజు క్లుప్తంగా వివరించారు.

అనంతరం కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ రాళ్లపాడు ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదని, ఈసారైనా పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ మైక్రో ఇరిగేషన్ కు సంబంధించి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, ప్రధానంగా బిందు, తుంపర్ల సేద్యం పనిముట్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, సబ్సిడీ ఎంత మేర వస్తుంది అనే విషయాలను రైతుకు అర్థమయ్యేలా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. అలాగే రానున్న వర్షాకాలంలోపు సోమశిల జలాశయ పటిష్టతకు సంబంధించి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ రెండో పంటకు పుష్కలంగా నీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని, రెండు రిజర్వాయర్లలో కూడా నీరు అందుబాటులో ఉందని చెప్పారు. రైతులందరూ తక్కువ నీటి వినియోగంతో పండే చిరుధాన్యాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమని, రైతులందరూ కూడా చిరుధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఎక్కువగా వరి వేయకుండా చిరుధాన్యాలు, పత్తి, వేరుశనగ పంటలపై దృష్టి సారించాలని రైతులకు ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.

అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సాగునీరు, వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు, రైతులు సూచించిన అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. సచివాలయ స్థాయి, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేసి, రైతుల సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మంచి గిట్టుబాటు ధర మార్కెట్లో లభిస్తుందని, ఎవరి దగ్గరికి వెళ్లకుండా కల్లాల్లోనే ధాన్యం మంచి ధరకు అమ్ముడుపోవడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారని, ఇది చాలా శుభపరిణామన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఉదారంగా ఆదుకునేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని, పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. ఏ సీజన్లో నష్టపోయిన పంటకు నష్టపరిహారాన్ని అదే సీజన్లో జమ చేస్తున్నామని, త్వరలోనే పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని, వైయస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా కూడా రైతులను ఆదుకుంటామన్నారు. యంత్ర పరికరాలు, స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టలను సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో నూరు శాతం ఈ క్రాప్ పూర్తి చేయాలనే లక్ష్యంతో అన్ని చర్యలు చేపట్టామని, జిల్లాలో అన్ని కియోస్కోలు పూర్తిస్థాయిలో వినియోగంలో ఉన్నాయని, వ్యవసాయ శాఖ సిబ్బంది 100 శాతం ఈ క్రాప్ పూర్తిచేయాలని సూచించారు. సారవంతమైన నేలలను గుర్తించడం, ఆ నేలల్లో ఏ పంటలు వేయాలి, ఎంత మేర దిగుబడి వస్తుంది అనే అంశాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు నేల సారవంత పరీక్షలు నిర్వహించి, సాయిల్ హెల్త్ కార్డ్ అందించేందుకు ప్లాంట్ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 26 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వైపు మొగ్గు చూపాలని, వారికి సబ్సిడీ కూడా అందిస్తున్నామని చెప్పారు.

రైతు భరోసా కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో 17శాతం తేమ ఉంటే, వారికి ఇచ్చే రసీదులో మీరు ఎక్కడికి వెళ్ళవద్దు ఆర్.బి.కెలకే ధాన్యం తీసుకురండి అని రైతుకు భరోసా కల్పించేలా ముద్రించి రసీదు ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు రవాణా, హమాలీ ఖర్చులను ప్రభుత్వమే భరించి, మూడు వారాల్లో రైతుకు ధాన్యం డబ్బులు అందించడం జరుగుతుందన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సంగం, నెల్లూరు పెన్నా బ్యారేజ్ లను పూర్తిచేసి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారని, ఈ ప్రాజెక్టుల ప్రయోజనాలను గుర్తించి సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇరిగేషన్ అండ్ పవర్ (సి.బి.ఐ.పి) సంస్థ అందించిన అవార్డును కలెక్టర్ అందుకోవడం జిల్లాకు ఎంతో గర్వకారణంగా మంత్రి పేర్కొన్నారు. అలాగే ఎప్పటి నుంచో జిల్లాలో పెండింగ్లో ఉన్న 30 వేలకు పైగా రైతులకు సంబంధించి సుమారు 43000 ఎకరాల చుక్కల భూములను ఒకే విడతలో పరిష్కరించేందుకు జీవోను ముఖ్యమంత్రి విడుదల చేశారని, త్వరలోనే ఆయా రైతులకు సంబంధించిన చుక్కల భూముల సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని, ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ముఖ్యమంత్రికి మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంస్కరణలు ప్రవేశపడుతూ రైతులకు అన్ని విధాల అండగా ఉంటూ, వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన వాకాటి నారాయణరెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయనను మంత్రి, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

చివరిగా రైతులకు ఓదెలు (చిరుధాన్యాలు) విత్తనాలను మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాఖ రూపొందించిన వ్యవసాయ, అనుబంధ శాఖల నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక 2023-24 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశాల్లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, వాకాటి నారాయణరెడ్డి, కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, తెలుగుగంగ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ హరి నారాయణ రెడ్డి, ఎస్ఈలు కృష్ణమోహన్, వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, ఏడి అనిత, పశుసంవర్ధక మత్స్యశాఖ జేడీలు మహేశ్వరుడు, నాగేశ్వరరావు, జడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రంగవర ప్రసాద్, ఆర్డీవోలు మలోల, శీనా నాయక్, కరుణ కుమారి, డీసీఎంఎస్, విజయ డెయిరీ చైర్మన్లు వీరి చలపతి, కొండ్రెడ్డి రంగారెడ్డి, సాగునీటి, వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

దేవుడు ఉన్నాడు.. విన్నాడు… చేస్తాడు… అమరావతి రైతు సభలో ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

రంజాన్ ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ స్రవంతి : వసతులపై అధికారులకు ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published.