Clock Of Nellore ( Kandukuru ) – 2017లో ఉత్తమ జడ్పీటీసి సభ్యునిగా అవార్డు అందుకున్న కంచర్ల శ్రీకాంత్ చౌదరి… తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించి, శాసన మండలిలో అడుగుపెట్టనున్నారు. నెల్లూరుజిల్లా, కందుకూరు పరిధిలోని వలేటివారిపాళెం మండలం, అత్తంటివారి పాళెం గ్రామానికి చెందిన కంచర్ల శ్రీకాంత్ చౌదరి బిటెక్, ఎంబిఏ విద్యను అభ్యసించారు. అందులోనే 2018లో డాక్టరేట్ సాధించారు. తండ్రి రామయ్య సీనియర్ జర్నలిస్ట్ కాగా ఆయన ప్రస్తుతం కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలను నిర్వహిస్తున్నారు. ఆ కళాశాలకు శ్రీకాంత్ చౌదరి కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. నందమూరి తారకరామారావు పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరిన శ్రీకాంత్ చౌదరి తండ్రి రామయ్య అదే పార్టీలో కొనసాగుతున్నారు. రామయ్య వారసునిగా శ్రీకాంత్ చౌదరి 2009లో క్రీయాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. 2014లో జరిగిన జడ్పీ ఎన్నికల్లో కందుకూరు నుండి ఆయన జడ్పీటీసి సభ్యునిగా పోటీ చేసి విజయం సాధించారు. కంచర్ల ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయంతో పాటూ ప్రభుత్వ కళశాలల్లోని ప్రతిభా వంతులైన విద్యార్ధులకు ప్రోత్సాహాలు ఇప్పటికీ అందిస్తున్నారు. 2021లో ఐ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైన కంచర్ల శ్రీకాంత్ చౌదరి, డిజిటలీకరణపై ఎక్కువ దృష్ఠి సారించారు. పట్టభద్రులంతా ఓటు నమోదు చేయించుకోవాలని సోషల్ మీడియా వేదికగా విస్త్రృత ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తనకు మద్దతు తెలపాలని కోరుతూ 3 లక్షల మంది పట్టభద్రులకు పోస్టు కార్డులు రాశారు. తమ కళాశాలలోనే కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఓటర్లను ఎప్పటి కప్పుడు చైతన్య పరుస్తూ వారందర్నీ తన వైపు తిప్పుకున్నాడు. పట్టభద్రుల ఆశీస్సులతో 34వేలా 110 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించారు.