Clock Of Nellore ( Amaravathi ) – శాసనసభలో తన పట్ల కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించారని చివరకు తాను పట్టుకుని ఉన్న ప్లకార్డును కూడా చించివేశారని నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. స్పీకర్ వారిని నిలువరించాల్సింది పోయి తనపై సస్పెన్షన్ వేటు వేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కోటంరెడ్డి విలేకరులతో మాట్లాడారు. తన నియోజకవర్గ సమస్యలపై గాంధీ గిరి పద్దతిలో సభ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్లకార్డు పట్టుకుని నిల్చొని ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలు తన ప్లకార్డును చించివేశారని, అంతే కాకుండా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తనను బండ బూతులు తిట్టారని అన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు స్పీకర్ వద్దకు వెళితే తనను సభ నుండి సస్పెండ్ చేశారని తెలియజేశారు. సభలో తనకు 10 నిముషాలు మైక్ ఇచ్చి ఉంటే తానేంటో చూపించేవాడినని పేర్కొన్నారు. ప్రజా స్వామ్యం ఖూనీ చేసే విధంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా డిస్మిస్ చేస్తారని, ఆ రోజు తొందర్లోనే ఉందని కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.