నెల్లూరులో యువకుడు దారుణహత్య : పథకం ప్రకారం బయటకు రప్పించి వేటు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు తల్పగిరి కాలనీలో బుధవారం తెల్లవారు జామున దారుణ హత్య జరిగింది. రావుల అనుదీప్ అనే యువకుణ్ని పథకం ప్రకారం ఇంటి నుండి బయటకు రప్పించిన దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. వివరాల్లో కెళ్లే… పొదలకూరుకు చెందిన అనుదీప్ కు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం అతను భార్యతో కలిసి నెల్లూరు నగరంలోని బుజబుజనెల్లూరులో నివాసం ఉంటున్నారు. ఇవాళ తెల్లవారు జామున 2:45 గంటలకు పొదలకూరుకు చెందిన స్నేహితుడు సురేష్, అనుదీప్ కు ఫోన్ చేసి తాను వేరే ప్రాంతానికి వెళ్లేందుకు నెల్లూరు రైల్వే స్టేషన్ కు వెళ్లాలని, నెల్లూరుకు వస్తున్నానని, తనను స్టేషన్ వరకూ డ్రాప్ చేయాలని ఫోన్ చేసి కోరగా తెల్లవారు జామున 3 గంటలకు అనుదీప్ ఇంటి నుండి బయటకు వెళ్లాడు. అంతే మళ్లీ తిరిగి రాలేదు. ఉదయం 6 గంటలకు తల్పగిరికాలనీ వద్ద ఓ కాలువ పక్కన శవమై కనిపించాడు. దుండగులు అతన్ని గొంతుపై కత్తితో పొడిచి చంపారు. విషయం తెలుసుకున్న వేదాయపాళెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. శవం పడి ఉన్న సమీపంలోని ఓ ఇంటి వద్ద సిసి టివి ఫుటేజీని పోలీసులు పరిశీలించగా కత్తిపోట్ల తర్వాత అనుదీప్ నడుచుకుంటూ వస్తూ కాలువ పక్కనే పడిపోయే దృశ్యాలు కనిపించాయి. అయితే నిందితులు ఆ ఫుటేజీలో కనిపించలేదు. పోలీసులు వివాహేతర సంభంధాల నేపద్యంలో హత్య జరిగి ఉండవచ్చునని అనుమానిస్తూ ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడు సురేష్ ను కూడా విచారిస్తున్నారు.

 

Read Previous

ఆదాల నివాసంలో జనమే జనం : సమస్యలపై విజ్ఞాపనల పర్వం

Read Next

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు : నామినేషన్ దాఖలు చేసిన మేరుగ మురళి

Leave a Reply

Your email address will not be published.