17వ తేదీ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి : ఆత్మీయ సమావేశంలో కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – బారాషహీద్ దర్గా, షాదీ మంజిల్, మైనార్టీ గురుకుల పాఠశాల నిర్మాణం తదితర సమస్యలపై ఈనెల 17వ తేదీనా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే నిరసన కార్యక్రమాన్ని ముస్లింలంతా జయప్రదం చేయాలని నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరులోని వారి కార్యాలయంలో ముస్లిం నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గత 9 సంవత్సరాలుగా పిలిస్తే పలికే వ్యక్తిగా అందుబాటులో ఉంటున్నానని, ప్రత్యేకించి ముస్లిం సమస్యలు, వారి సంక్షేమంపై అలుపెరుగకుండా శ్రమించానని గుర్తు చేశారు. అవమానపడ్డ పార్టీలో ఉండకూడదని నిర్ణయం తీసుకుని పక్కకు వచ్చిన తనకు పెద్ద సంఖ్యలో ముస్లింలు మద్దతు తెలిపి అండగా నిలిచారని మీ అందరికీ భవిష్యత్తులో అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. 17వ తేదీ జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతీ ఒక్క ముస్లిం పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్బంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా అభివృద్ధికి పాటు పడిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని అన్నారు. దేశంలో ఎన్.ఆర్.సి సమస్య వచ్చినప్పుడు రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలలో ఏ ఎమ్మెల్యే కూడా ముస్లింల తరపున నిలబడలేదని, అలా నిలబడ్డ ఏకైక వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని గుర్తు చేసుకున్నారు. పార్టీ ఏదైనా జెండా ఏదైనా తామంతా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే ఉంటామని ముస్లిం నాయకులు స్పష్టం చేశారు.

Read Previous

జిల్లా నాయకత్వం ఆమోదిస్తేనే టిడిపిలోకి కోటంరెడ్డి : ఇప్పటి వరకూ ఆచర్చే రాలేదన్న అజీజ్

Read Next

నెల్లూరు జనసేనలో గ్రూపు తగాదాలు : పార్టీ నుండి కేతంరెడ్డి సస్పెన్షన్

Leave a Reply

Your email address will not be published.