Clock Of Nellore ( Nellore ) – 2019 ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి అభ్యర్ధిగా బి – ఫారం తీసుకుని నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ చేస్తూ చివరి నిముషంలో హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యి జగన్మోహన్ రెడ్డి చేత వైసీపి కండువా కప్పుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి నేడు అదే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైసీపి ఇంఛార్జ్ గా నియమితులయ్యారని, గత అనుభవాల దృష్ఠ్యా రూరల్ లో ఆయన పోటీ చేస్తారా లేదా అనే అనుమానం ప్రజలతో పాటూ తనకూ ఉందని నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆదాల చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి స్పందించారు. కోటంరెడ్డి జీవిత కాలం ధర్నాలు చేసుకోవాల్సిందే అన్న ఆదాల వ్యాఖ్యలపై కోటంరెడ్డి స్పందిస్తూ తన రాజకీయ జీవితం ప్రారంభమయిందే పోరాటాలతో అని అన్నారు. పోరాటాలు చేసే తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని పేర్కొన్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని ఆదాల ప్రభాకర్ రెడ్డా తనను విమర్శించేది అని కోటంరెడ్డి దుయ్యబట్టారు. ఈ దఫా నెల్లూరు రూరల్ నుండి వైసీపి ఎమ్మెల్యేగా తాను పోటీ చేయబోనని చెబుతున్నానని… ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపి అభ్యర్ధిగా పోటీ చేస్తారని ఖచ్చితంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. 2019లో అప్పటి అధికార పార్టీ అయిన టిడిపిలో బీ – ఫారం తీసుకుని చివరి క్షణాల్లో పరుగో పరుగు అంటూ తాను ఆదాల ప్రభాకర్ రెడ్డిలా వైసీపిలో చేరలేదని… అధికారాన్ని 15 నెలలు ముందుగానే వదులుకుని పక్కకు వచ్చానన్నారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో జగన్ రెడ్డి పులివెందుల రౌడీ, కోటంరెడ్డి నెల్లూరు రౌడీ అని టిడిపిలో ఉండి ఆదాల ప్రభాకర్ రెడ్డి విమర్శులు చేశారని… అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపిలో చేరి నేడు తనను రౌడీ అంటున్నారని ఎవరు రౌడీనో ప్రజలకు తెలుసునన్నారు.