Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో తాను చరిత్రలో నిలిచిపోయే పనులు చేశానని, జూలై నెలకల్లా ఆ పనులన్నీ పూర్తవుతాయని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. జూలై నెలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ వివరాలను వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. గురువారం అనీల్ కుమార్ యాదవ్ రామలింగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ వంతెన పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం అనీల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో ఏం అభివృద్ధి చేశారని కొందరు ప్రశ్నిస్తున్నారని అయినప్పటికీ వారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కానీ ప్రజలకు మాత్రం నేనేం అభివృద్ధి చేశానో వివరిస్తానన్నారు. నెల్లూరు చరిత్రలో చిరకాలంగా నిలిచిపోయే పనులు తన హయాంలో జరిగినందుకు సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి, రామలింగాపురం ఫ్లై ఓవర్, సర్వేపల్లి కాలువ ఆధునీకరణ, జాఫర్ సాహెబ్ కెనాల్ ఆధునీకరణ, మైపాడు రోడ్డు సుందరీకరణ లాంటి చరిత్రలో నిలిచిపోయే పనులు చేపట్టినట్లు అనీల్ కుమార్ వెల్లడించారు. జూలై నెలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఆ పనులను ప్రజలకు చూపించబోతున్నట్లు తెలియజేశారు. అవే కాకుండా స్కూళ్లు, హాస్పిటల్స్ ను కూడా నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, కర్తం ప్రతాప్ రెడ్డి, వేలూరు మహేష్, నీలి రాఘవరావు, నేతలు నేతాజీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
