Clock Of Nellore ( Nellore ) – ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోం శాఖకు తాను లేఖ రాసినట్లు నెల్లూరు రూరల్ వైసిపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అపాయింట్ మెంట్ లభిస్తే నేరుగా వెళ్లి ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి తాను నిరంతరం ప్రజల్లోకి వస్తానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను ఆరోపిస్తే… తన పైనే విమర్శలు చేస్తున్నారని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన ఆరోపణలపై ఎదుటివారు సరైన పద్దతిలో మాట్లాడాలి గానీ… తనపై శాపనార్ధాలు, విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పనుల గురించి మాట్లాడితే తప్పా అని కోటంరెడ్డి ప్రశ్నించారు. కాంట్రాక్టర్ కు నిధులు ఆపేస్తే అభివృద్ధి నిలిచిపోతుందని, ప్రజలు ఇబ్బంది పడతారని, రహదారులు, కాల్వల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. ధ్వంసమైన రహదారులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని… అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో దెబ్బతిన్న రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కోటంరెడ్డి కోరారు. పొట్టేపాళెం కలుజుపై వంతెన నిర్మాణం కోసం 2021 నుంచి తాను ముఖ్యమంత్రిని అడుగుతున్నానని, దానికి 28 కోట్లు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పినా అధికారులు నిధులు విడుదల చేయలేదని కోటంరెడ్డి వెల్లడించారు. మైనార్టీ గురుకుల పాఠశాల నిర్మాణం ఆగిపోయి ఉందని, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ పనులకు కేంద్రం నిధులు మంజూరు చేసి ఉందని ఆ పనులు పూర్తి చేయాలని కోరారు. బారాషహీద్ దర్గాలో మసీదు నిర్మాణానికి 15 కోట్లు నిధులు ఇస్తున్నట్లు స్వయానా ముఖ్యమంత్రి జీఓ ఇవ్వగా, ఇంత వరకూ నిధులు విడుదల చేయలేదని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.
ఈనెల 17 నుండి ప్రజా సమస్యలపై పోరాటాలు !
రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఇకపై పోరాటాలు చేయనున్నట్లు కోటంరెడ్డి స్పష్టం చేశారు. బారాషహీద్ దర్గా అభివృద్ది పనులు, మైనార్టీ గురుకుల పాఠశాల నిర్మాణం పూర్తి కోసం ఈనెల 17వ తేదీనా ముస్లింలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పొట్టేపాళెం వద్ద వంతెన, రోడ్ల నిర్మాణాల కోసం ఈనెల 25వ తేదీనా ప్రజలతో కలిసి రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతానన్నారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు.
