సమాజ హితం కోసమే జర్నలిజం : ఉన్నది ఉన్నట్లు చెప్పాలన్న ప్రెస్ అకాడమీ ఛైర్మైన్

Clock Of Nellore ( Nellore ) – సమాజ హితం కోసం యువత జర్నలిజంపై అభిరుచి పెంచుకోవాలని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నెల్లూరు పర్యటనలో భాగంగా గురువారం విక్రమ సింహపురి విశ్వ విద్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సుందరవల్లి, రిజిస్ట్రార్ రామ చంద్రారెడ్డి, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర ప్రసాద్, ఆర్డీవో మలోల, ప్రిన్సిపాల్ విజయానంద్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జర్నలిజం – విలువలపై విద్యార్థులతో ప్రత్యేకంగా నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొని జర్నలిజంకు సంబంధించి విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉపాధి అవకాశాలు గల జర్నలిజం వైపు యువత అభిరుచి పెంచుకొని, సమాజానికి ఉపయోగపడేలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అన్ని రంగాల కంటే జర్నలిజం ఎంతో విలువైనదని, నిజాయితీగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఈ రంగం ద్వారా లభిస్తుందన్నారు. పత్రికలు పక్షపాత ధోరణి వీడి వాస్తవాలను ప్రజలకు తెలుపాలని, ప్రభుత్వంలో ఉండే లోపాలను ఉన్నవి ఉన్నట్టు తెలియజేయాలని, అవాస్తవాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ధోరణి వీడాలని సూచించారు. యువత సమాజంలో జరిగే మంచి చెడులను గ్రహించి వాస్తవాల వైపు పయనించాలని, ఇదే నిజమైన జర్నలిజమని సూచించారు. సమాజంలో జరిగే వాస్తవాలను తెలియజేయడమే మీడియా ప్రధాన కర్తవ్యం అని, దానిని విస్మరించరాదన్నారు. అలాగే అన్ని విశ్వవిద్యాలయాల్లో జర్నలిజం కోర్సు కు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించామని, విద్యార్థులకు సులభంగా ఉండేలా వ్యవహారిక భాషలో జర్నలిజం కోర్సులను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర ప్రసాద్, ఆర్డీవో మలోల, ప్రిన్సిపాల్ విజయానంద్, విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Read Previous

హక్కులను హరించే జీఓపై భగ్గుమన్న టిడిపి : నెల్లూరులో నిరసనలు

Read Next

ఘనంగా నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్ జన్మదిన వేడుకలు

Leave a Reply

Your email address will not be published.