Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్ పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి ముఖ్యమంత్రి వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమానికి నెల్లూరు కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్, మత్స్య శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను మత్స్యకారులకు సంపూర్ణంగా అందజేస్తున్నామని చెప్పారు. మత్స్యశాఖ ఏడి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద 21 మంది మత్స్యకారులకు బోట్లు, వలలు, మోటారు ఇంజన్లు అందించామని చెప్పారు. జువ్వలదిన్నెలో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి కావచ్చిందని, దీని ద్వారా 6 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే ఫిష్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా మినీ రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఎస్సీ ఎస్టీలకు 60 శాతం, ఇతరులకు 40శాతంతో సబ్సిడీతో రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ అవుట్లెట్ల ద్వారా వినియోగదారులకు నాణ్యమైన మత్స్య సంపద లభించడంతోపాటు మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉండి అవుట్లెట్ల నిర్వాహకులకు మంచి లాభాలు వస్తాయన్నారు. ఆసక్తి గలవారు మత్స్యశాఖ అధికారులను సంప్రదించాలని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మత్స్యకారులకు అన్ని విధాల సహకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం ఆక్వా రైతులకు లైసెన్స్ లను జాయింట్ కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడి శ్రీనివాసులు, ఆక్వా రైతులు, మత్స్యకార సంఘ నాయకులు పాల్గొన్నారు.
