Clock Of Nellore ( Nellore ) – 4వ తరగతి బాలికపై ఉద్యోగి లైంగిక దాడికి కారణమైన నెల్లూరు డైకాస్ రోడ్డులోని ఓవెల్ 14 స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపి విద్యార్ధి జేఏసి ప్రధాన కార్యదర్శి పి. ఆదిత్య సాయి ఆధ్వర్యంలో విద్యార్ధి సంఘాల నేతలు ఆదివారం నెల్లూరు గాంధీ బొమ్మ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య సాయి మాట్లాడుతూ బాలికపై ఉద్యోగి బ్రహ్మయ్య గత కొంత కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని వారి కుటుంబసభ్యులు యాజమాన్యం దృష్ఠికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని, దాని కారణంగానే తాజాగా మరో సారి ఆ ఉద్యోగి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని అన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత స్కూల్ యాజమాన్యంతో పాటూ ప్రిన్సిపల్ దేనని అన్నారు. తక్షణం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో టోనీబాబు, మురళీ కృష్ణాయాదవ్, శ్రీకాంత్, వెంకటేష్, కిషోర్, శివ, జాన్, బెన్నీ, సుహేబ్ పాల్గొన్నారు.