Clock Of Nellore ( Golagamudi ) – పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో అత్యాధునిక వసతులతో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమ వైద్యశాలను ప్రారంభించడం శుభ పరిణామమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వెంకటాచల మండలం, గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తొలుత ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఈవో బాల సుబ్రహ్మణ్యం, ట్రస్టు సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలకగా, మంత్రి భగవాన్ వెంకయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రూ. 5 కోట్లతో నిర్మించిన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమ వైద్యశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావనతోపాటు, సేవా దృక్పథంతో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ భగవాన్ వెంకయ్య స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం మానవసేవే మాధవ సేవగా భావించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఈవో బాలసుబ్రమణ్యంను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఆలయ సమీపంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వైద్యానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పూర్తి ఉచితంగా అత్యాధునిక వసతులతో వైద్య సేవలు పొందాలనే లక్ష్యంతో ఈ వైద్యశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వైద్యశాలలో ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి, ఫిజియోథెరపీ, కృత్రిమ అవయవాల ఏర్పాటు ఇలా అన్ని రకాల వైద్యసేవలు పేదలకు ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పక్షవాతానికి గురైన వారికి మెరుగైన వైద్యం అందించి వారు త్వరగా కోలుకొని, కనీసం వారి పనులు వారు చేసుకునేలా వైద్య సేవలు అందించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించినట్లు చెప్పారు. అలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక జూనియర్ కళాశాలను కూడా నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి స్థలం కేటాయింపునకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపినట్లు చెప్పారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం ఆలయ సమీపంలో ఏర్పాటుచేసిన కార్తీక వన భోజనాలకు హాజరైన భక్తులకు మంత్రి స్వయంగా వడ్డించి, భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాలసుబ్రమణ్యం, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్, స్థానిక నాయకులు మందల వెంకట శేషయ్య, ప్రదీప్ రెడ్డి, రాజా నాయుడు తదితరులు పాల్గొన్నారు.
