నెల్లూరు పోలీసుల ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు దేవక్క

Clock Of Nellore ( Nellore ) – దాదాపు 10 కేసుల్లో నిందితురాలిగా ఉంటూ ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మహిళా మావోయిస్టు రామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క పోలీసులకు లొంగిపోయారు. మంగళవారం ఆమె నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు వద్దకు వెళ్లి తాను లొంగిపోతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ 59 సంవత్సరాల వయస్సున్న దేవక్కతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన రామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క మావోయిస్టు భావాలకు ప్రభావితం అయి తన ఇద్దరు పిల్లల్ని హాస్టల్ చేర్చి 1984లో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎర్రవరం దళంలో ఏరియా కమిటి సభ్యురాలిగా రాజేశ్వరి పనిచేశారన్నారు. విశాఖ పట్నం, రాజమండ్రి జిల్లాల్లో డెన్ కీపర్ గా ఉంటూ మావోయిస్టుల సమావేశాలకు, వైద్య సౌకర్యాలకు ఆర్ధిక అవసరాలు తీర్చడంతో పాటూ పలువురు మావోయిస్టులకు ఆశ్రయం కూడా కల్పించారని ఎస్పీ వెల్లడించారు.

1987లో భారీగా ఆయుధాలు కలిగి ఉండగా రాజేశ్వరితో పాటూ మరో 5 మందిని కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారన్నారు. అదే క్రమంలో మావోయిస్టులు 8 మంది ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసిన రాజేశ్వరితో పాటూ 5 మందిని విడిచి పెట్టాలని డిమాండ్ తో… రాజేశ్వరితో పాటూ 5మందిని విడిపించిన మావోయిస్టులు తర్వాత అడవుల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. రాజేశ్వరిపై బస్సుల తగుల బెట్టిన కేసుతో పాటూ మొత్తం 10 కేసులు ఉన్నాయన్నారు. రాజేశ్వరిని పట్టి ఇస్తే ప్రభుత్వం ఇప్పటికే 4 లక్షల రూపాయల రివార్డును ప్రకటించి ఉందని ఎస్పీ పేర్కొన్నారు. మూడు కారణాల వల్ల రాజేశ్వరి లొంగిపోయిందని తెలిపారు. 2018లో భర్త మరణంతో కుంగుబాటుకు గురవ్వడం, తనతో పనిచేసిన క్యాడర్ లో ఇప్పటికే చాలా మంది లొంగిపోయి ఉండటం, వయస్సు పెరగడం, అనారోగ్య సమస్యల వల్ల రాజేశ్వరి లొంగిపోయిందన్నారు. రాజేశ్వరిపై ఉన్న 4 లక్షల రివార్డు నగదుతో పాటూ ఆమెకు చట్ట పరంగా లభించే అన్నీ సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ విజయరావు ప్రకటించారు.

Read Previous

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు : పొట్టి శ్రీరాములుకు నివాళులు

Read Next

” స్పందన” స్పందించడం లేదు : కేతంరెడ్డి ఆరోపణ

Leave a Reply

Your email address will not be published.