జెన్ కో ప్లాంటును జాతికి అంకితమిచ్చిన సిఎం జగన్ : మరికొన్నింటికి శంఖుస్థాపనలు

Clock Of Nellore ( Muthukur ) – పాదయాత్రలో..ఎన్నికల సమయంలో మీ కష్టాలు చూసిన తరువాత నేను విన్నాను..నేను ఉన్నానని ఆ రోజు చెప్పిన మాటను నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ లోని మూడవ ప్లాంటును ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఫిషింగ్‌ జెట్టికి సీఎం వైయ‌స్ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు.

దేవుడి దయతో ఈ రోజు కొన్ని మంచి కార్యక్రమాలు ప్రారంభించడం, కొన్నింటికి శంకుస్థాపనలు చేయడం జరుగుతున్నాయని, ఈ రోజు రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగు వేస్తున్నామన్నారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో ఏపీ జెన్‌కో స్వయంగా నిర్మించిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లోని 800 మెగా వాట్లా ప్లాంట్‌ను ఈ రోజు మీ సమక్షంలో జాతికి అంకితం చేస్తున్నామని, ఈ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మన దివంగత నేత, వైయస్‌ రాజశేఖరరెడ్డి 2008లో శంకుస్థాపన చేశారని, ఈ రోజు ఇదే థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు మన రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకున్నామని, మహానేత చొరవతో మన ప్రభుత్వం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను పూర్తి సామర్థ్యంతో ప్రారంభించడం దేవుడిచ్చిన అదృష్టంగా భౠవిస్తున్నానని సిఎం అన్నారు.

రాష్ట్రంలో గృహ, వాణిజ్య విద్యుత్‌ వినియోగదారులందరికీ రోజంతా కూడా నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్‌ను, వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేయడం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ థర్మల్‌ స్టేషన్‌లోని ఈ ప్రాజెక్టుకు అక్షరాల రూ.3,200 కోట్లు ఇచ్చి యుద్ధప్రాతిపాదికన ఖర్చు చేసి ఈ మూడున్నరేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాం అన్నారు జగన్. రాష్ట్ర విద్యుత్‌ అవసరాల్లో 40 శాతం ఏపీ జెన్‌కో ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. ఈ ప్లాంట్‌నుంచి రోజుకు 19 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం. ఏపీ గ్రిడ్‌కు ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది. సాధారణ ప్లాంట్‌తో పోలిస్తే..ఈ ప్లాంట్‌ తక్కువ బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. దీని వల్ల కాలుష్యం కాస్తో కూస్తో తగ్గించవచ్చునని తెలియజేశారు.

ఇక్కడ కృష్ణ పట్నం పోర్టు, థర్మల్‌ ప్లాంట్‌ రావాలని, ఇందు కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా నిండు మనసుతో శిరస్సు వంచి ప్రత్యేకంగా అభివాదం తెలియజేస్తున్నాను. వీళ్లందరికీ మంచి చేసే కార్యక్రమాలను కూడా ఈ రోజు అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇది వరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రెండో దశలో 150 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ ఈ నెలలోనే పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చామని జగన్ ప్రకటించారు. ఈ రోజు ఇక్కడికి రావడానికి ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం ఒక కార్యక్రమం అయితే..ఆ రోజు పాదయాత్రలో, ఎన్నికల వేళ మీ అందరికీ చేస్తానని చెప్పింది చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఆ రోజు మీరంతా కూడా అడిగారు. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేం గుర్తుకు వస్తాం. ఎన్నికలప్పుడు చంద్రబాబు హడావుడిగా ఇక్కడికి ఇదిగో ఇస్తున్నాను..చేస్తున్నానని మమ్మల్ని మోసం చేసే ప్రక్రియ జరుగుతుందని మీరంతా చెప్పారు. నేను ఒక్కటే చెబుతున్నాను..ఆ రోజు నేను చూశాను..నేను విన్నాను..నేను ఉన్నాను అని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ 16,218 మత్స్యకారేత కుటుంబాలకు రూ.34.74 కోట్ల సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను. ఆ రోజు హడావుడిగా మోసం చేసే ఉద్దేశంతో 326 కుటుంబాలకు మాత్రమే రూ.14 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మిగిలిన కుటుంబాలకు కూడా ఈ రోజు మంచి చేస్తూ అందరికీ ప్యాకేజీ ఇస్తున్నానని సిఎం తెలియజేశారు.

ఇదే నెల్లూరు జిల్లాలోని పెన్నా నది మధ్యలో ముదివర్తిపాలెం వద్ద కాజ్ వే నిర్మాణం కోసం రూ.93 కోట్లు కేటాయిస్తు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాను. నా సోదరుడు, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి అడిగిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ మధ్య కాలంలోనే నెల్లూరు బ్యారేజీని ప్రారంభించాం. ఆ బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెడుతున్నాం. ఈ ప్రాజెక్టును కట్టడం వల్ల సముద్రంలోకి వెళ్లే బ్యాక్‌ వాటర్‌ను ఆపగలుగుతాం. నాలుగు మండలాలకు మంచి ప్రాజెక్టు అవుతుంది. ఆ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచే శంకుస్థాపన చేస్తున్నానని జగన్ వెల్లడించారు.

ఇక్కడే మరో ప్రాజెక్టుకు శంకు స్థాపన చేశాం. మత్స్యకారులకు రూ.25 కోట్లతో ప్రత్యేక జెట్టి నిర్మాణం కోసం శంకుస్థాపన చేశాం. ఈ రోజు ప్రతి ఒక్కరికీ మంచి జరిగేలా ..ప్రతి ఒక్కరికి మంచి చేయాలని అడుగులు వేస్తూ తాపత్రయ పడుతున్నాను. ప్రతి గ్రామం రూపురేఖలు మార్చాలని తాపత్రయ పడుతున్న మన ప్రభుత్వానికి మీ అందరికి చల్లని ఆశీస్సులు, దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నానని సిఎం పేర్కొన్నారు.

Read Previous

సిఎం గో బ్యాక్… కమ్యూనిస్టు నేతల ఆందోళన… అరెస్ట్ చేసిన పోలీసులు

Read Next

నెల్లూరు బ్యారేజీ ఇకపై నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీ

Leave a Reply

Your email address will not be published.