Clock Of Nellore ( Nellore ) – సమాచార హక్కు చట్టం దరఖాస్తుల పరిశీలన, నిర్దిష్ట గడువులోగా పరిష్కారానికి జిల్లా స్థాయి ఆర్టీఐ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బి.వి.రమణకుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నెల్లూరులోని జడ్పీ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై కమిషనర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమాచార హక్కు చట్టం పక్కాగా అమలు చేయాలని, దరఖాస్తు దారులు కోరిన సమాచారాన్ని ఆర్టీఐ నిబంధనల మేరకు నిర్దిష్ట గడువులోగా అందించాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు, ప్రభుత్వ కార్యకలాపాల సమాచారాన్ని ఎటువంటి గోప్యత లేకుండా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టం ఏర్పడిందన్నారు.

ప్రజాధనంతో చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వివరాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ఈ విషయాలపై అడిగే సమాచారాన్ని జాప్యం లేకుండా అందించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్ 4(1బి)లో పొందుపరిచిన 17 అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. ముఖ్యంగా కార్యాలయాల ముందు పౌర సమాచార అధికారి పేరు, అప్పిలేట్ అధికారి పేరు, ఫోన్ నెంబర్లు, అందిస్తున్న సేవలకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుపుతూ సమాచార హక్కు చట్టం బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రతి నెలా మూడో శుక్రవారం సమాచార హక్కు చట్టం దరఖాస్తులపై ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షా సమావేశం నిర్వహించి సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భూ సంబంధ సమస్యలకు సంబంధించి వస్తున్న ఆర్టీఐ దరఖాస్తులపై రికార్డులు లేవని తప్పించుకోకుండా బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆర్టిఐ దరఖాస్తుదారులు కూడా సమాజ హితం కోసం సమాచార చట్టం వినియోగించాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా పరిపాలన పారదర్శకత పెరిగిందని, ఎక్కడా గోప్యత లేకుండా సరైన సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్నామని చెప్పారు. ఆర్టీఐ చట్టాన్ని సరైన మార్గంలో వినియోగించుకుంటే సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. తొలుత జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు తీరును వివరించారు. అనంతరం ఆర్టిఐ దరఖాస్తుదారులు, పౌర సమాచార అధికారులు తెలిపిన సందేహాలను కమిషనర్ నివృత్తి చేశారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవా సంస్థ అధ్యక్షులు, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, ఏ ఎస్ పి హిమవతి, డిఆర్డిఎ పీడీ సాంబశివ రెడ్డి, డిఎంహెచ్వో పెంచలయ్య, జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, పంచాయతీ రాజ్ ఎస్ఈ శివారెడ్డి, నెల్లూరు, కావలి ఆర్ డి వో లు మలోల, శీనానాయక్, సమాచార శాఖ, సోషల్ వెల్ఫేర్ డిడిలు రమాదేవి, వెంకటేశ్వర ప్రసాద్, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, పౌర సమాచార అధికారులు, ఆర్టిఐ దరఖాస్తుదారులు పాల్గొన్నారు.