Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నేతలు గాంధీ విగ్రహాలకు, చిత్ర పటాలకు ఘనంగా నివాళి అర్పించి ఆయన చూపిన మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. నగరంలోని ట్రంకురోడ్డులో ఉన్న గాంధీ విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాాకాణి గోవర్ధన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయనతో పాటూ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ హరిత తదితరులు కూడా గాంధీకి నివాళి అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని జెట్టి శేషారెడ్డి కళ్యాణ మండపంలో వ్యవసాయ శాఖ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఆయనతో పాటూ కలెక్టర్ చక్రధర్ బాబు కూడా ఉన్నారు. నెల్లూరు మాగుంట లే అవుట్ లో ఉన్న వైసీపి జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. రాజ్యసభ సభ్యులు, వైసీపి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యి గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ స్రవంతి, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. జిల్లా ఎస్పీ విజయరావు జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. నగరంలోని తెలుగు దేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు జరగ్గా నేతలు గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు.
