కావలిలో మంత్రి కాకాణి పర్యటన – చేయూత లబ్ధిదారులకు చెక్కులు

Clock Of Nellore ( Kavali ) – ఎన్నికల్లో గెలవడానికో, ఓటర్లను ఆకట్టుకోవడానికో కాకుండా కేవలం పేదలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే దృఢ సంకల్పంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరుజిల్లాలోని కావలి మండల పరిషత్ కార్యాలయంలో కావలి టౌన్, రూరల్ మండలానికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత పధకం కింద 3వ విడత ఆర్ధిక సాయాన్ని 7195 మంది లబ్ధిదారులకు సుమారు 13.48 కోట్ల రూపాయల మెగా చెక్కును కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో కలిసి మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి లబ్ధిదారులకు అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని సాకుగా చెప్పి అమ్మ ఒడి, చేయూత, వాహన మిత్ర, ఆసరా వంటి పథకాలను అమలు చెయ్యొద్దని, అలాగే అన్ని పథకాలు ఒకేసారి కాకుండా ఒక్కొక్క పథకం ఒక్కొక్కసారి అమలు చేయాలని సీఎంకు కొందరు సలహాలు ఇచ్చారని, వారి మాటలు ఏమాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి పేదల సంక్షేమమే లక్ష్యంగా అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి చిత్తశుద్ధిగా సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్నట్లు చెప్పారు. అనేక రకాల సంక్షేమ పథకాల గురించి గతంలో ఏ ఒక్కరూ ఆలోచించలేదని, పేదల మేలుకోరే ముఖ్యమంత్రి కాబట్టే మన జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను పేదల గడప వద్దకే చేరుస్తున్నారని కొనియాడారు.

ఈ మూడేళ్లలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లో నేరుగా లక్షా 70 వేల కోట్ల రూపాయలను జమ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని మంత్రి కాకాణి పేర్కొన్నారు. పేద ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ అక్క చెలెమ్మలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ, జీవనోపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఏటా రూ.18,750 ల చొప్పున క్రమం తప్పకుండా వరుసగా నాలుగేళ్ల లో మొత్తం 75 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పధకం కింద మొత్తం మూడు విడతల్లో 14,110.61 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని 75,25,663 మంది లబ్ధిదారులకు, జిల్లాలో మొత్తం మూడు విడతల్లో 645 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని 3,43,998 మంది లబ్ధిదారులకు అందించినట్లు మంత్రి తెలిపారు.

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండడుగులు ముందుకేసి ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. వ్యవసాయానికి కూడా ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని, కావలి కాలువ ద్వారా సాగునీరు పుష్కలంగా లభించి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. కావలి పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్న ఎమ్మెల్యే, ఫిషింగ్ హార్బర్, కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ముందుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు, చివరిగా కేక్ కట్ చేసి సీఎంకు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు సాంబ శివారెడ్డి, రవీంద్ర, ఆర్డిఓ శీనానాయక్, జెడ్ పి టి సి జంపాని రాఘవులు, ఎంపీపీ కొండమ్మ, రెవిన్యూ, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఉదయగిరిలో నూతన భవనాలు : ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

Read Next

నెల్లూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు…

Leave a Reply

Your email address will not be published.