Clock Of Nellore ( Nellore ) – వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందుకున్న మొత్తాన్ని పెట్టుబడిగా సద్వినియోగం చేసుకుని, మహిళలు ఆర్ధిక సుస్థిరత సాధించాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆకాంక్షించారు. నెల్లూరు నగర పాలక సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్తంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ చేయూత 3వ విడత వారోత్సవాలను స్థానిక రాజన్న భవన్ సమీపంలోని ఎం.సి.ఎమ్ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే అనీల్ కుమార్ హాజరై నగర నియోజకవర్గానికి మంజూరైన చేయూత మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతాశయాలతో రూపొందించిన వైఎస్సార్ చేయూత పధకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మహిళలకు ఆర్ధిక స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు. చేయూత ద్వారా వచ్చిన మొత్తాన్ని పెట్టుబడిగా మార్చుకుని చిల్లర దుకాణాలు, పాలు, పండ్లు, కూరగాయల అంగళ్ల ఏర్పాటుతో పాటు గొర్రెలు, మేకల పెంపకంతో ఆర్ధికంగా ఎదుగుదల సాధించవచ్చని తెలిపారు. ఔత్సాహిక వ్యాపారస్తులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమూల్, రిలయన్స్, పీ&జీ, ఐటీసీ వంటి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందని, ఆసక్తి కలిగిన మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పధకం ద్వారా లబ్ది కల్పిస్తోందని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ హరిత, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్ర బాబు, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు జయలక్ష్మి, అరుణ, రామకృష్ణ, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
