Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దెబ్బదిన్న రోడ్ల స్థానంలో తిరిగి 80 శాతం మేర నూతన రోడ్లను నిర్మించామని, మిగిలిన 20 శాతం రోడ్ల నిర్మాణాలను కూడా త్వరలో పూర్తి చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. 2.52 కోట్ల రూపాయలతో నగరంలోని కేవిఆర్ పెట్రోల్ బంకు సెంటర్ నుండి అయ్యప్పగుడి వరకూ నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణానికి వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శనివారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో భాగంగా వేదాయపాళెం సెంటర్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద 200 మీటర్ల మేర సిమెంటు రోడ్డును నిర్మిస్తామన్నారు. అత్యంత వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కోటంరెడ్డి వెల్లడించారు. కేవలం నగరమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్ల నిర్మాణాలకు 13 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. రూరల్ నియోజకవర్గంలో శివారు ప్రాంతాలు ఉన్నందుకు కొత్తగా పలు కాలనీలు ఏర్పాటయ్యి నియోజకవర్గం విస్తరిస్తుందని, దానికి తగ్గట్టుగా అభివృద్ది పనులు కూడా చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, 26, 27, 28, 29, 36, 37, 38వ డివిజన్ల కార్పొరేటర్లు బూడిద సుప్రజ, మురహరి, చెక్కా అహల్య, సత్తార్, పిండి శాంతి, బొబ్బల శ్రీనివాస యాదవ్, దాసరి అమృత, వైసీపి మహిళా విభాగం నగర అధ్యక్షురాలు తోట శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
