చెత్త పన్ను వసూలు చేయండి – సిబ్బందికి కమిషనర్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – నగరంలో ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్న నూతన వాహనాల రుణ బకాయిల చెల్లింపులకు యూజర్ చార్జీల వసూళ్లు తప్పనిసరి అని, అన్ని డివిజన్ లలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ హరిత శానిటేషన్ విభాగం సిబ్బందిని ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా (CLAP) యూజర్ చార్జీల వసూళ్ళపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని శుక్రవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ నిర్వహించారు. సమీక్షలో భాగంగా సచివాలయాల వారీగా శానిటరీ సూపర్ వైజర్లు, ఇన్ స్పెక్టర్లు, సెక్రెటరీల విధివిధానాలను అడిగి తెలుసుకుని, వారు తెలిపిన గణాంకాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషనర్ విధుల పట్ల సిబ్బంది అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమీక్షలో కమిషనర్ కు అధికారులు అందించిన నివేదికలో శానిటరీ విభాగంలోని మొత్తం 1505 పారిశుద్ధ్య సిబ్బందిలో 238 మంది శాశ్వత, 1267 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని, వారంతా రెండు షిఫ్టులలో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

సచివాలయం శానిటేషన్ సెక్రటరీ విధుల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు బయో మెట్రిక్ హాజరుతో విధులకు హాజరై, సిబ్బంది ముఖ హాజరును తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం సిబ్బంది ద్వారా రోడ్ల సఫాయీ, డ్రైన్ వర్క్, డోర్ టు డోర్ చెత్త సేకరణ వాహనాల తరలింపు, డ్రైను కాలువల్లో స్ప్రే, ఫాగింగ్, గ్యాంగ్ వర్క్, సచివాలయాలకు వచ్చే సమస్యల స్పందనల పరిష్కారం, యూజర్ చార్జీల వసూళ్లు, ట్రేడ్ లైసెన్సుల మంజూరు, హోటళ్లు, ఇతర కమర్షియల్ భవనాల్లో పారిశుధ్య నిర్వహణ తనిఖీలు, ఇళ్లకు వెళ్లి ప్రజల్లో తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించడం, ఇండ్లలో మురుగునీరు నిల్వ ఉంచకుండా ‘ ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.

మొత్తం 2 పెద్ద ఫాగింగ్ వాహనాలతో ప్రతిరోజూ 4 డివిజనుల్లో ఫాగింగ్ ప్రక్రియ జరుగుతోందని, ఆయా సచివాలయాలకు ముందస్తు సమాచారంతో శానిటరీ సెక్రెటరీలు ఫాగింగ్ చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సాధారణ గృహాలలో యూజర్ చార్జీల వసూళ్లను వలంటీర్ల ద్వారా వసూలు చేస్తున్నారని, కమర్షియల్ భవనాల్లో సెక్రెటరీలు వసూలు చేసి, ఆయా మొత్తాలను ప్రతీ రెండు రోజులకు ట్రెజరీలో జమ చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ లైసెన్స్, కరెంటు కనెక్షన్లు, కమర్షియల్ భవనాల పూర్తి వివరాలను రూపొందించి పన్ను వసూళ్లు పెరిగేలా ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం శానిటేషన్ ఇన్స్పెక్టర్ లకు ప్రస్తుతం ఉన్న పన్నుల డిమాండ్, వసూలు చేసిన మొత్తాల వివరాలను కమిషనర్ అడిగి తెలుసుకుని వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, పశు వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్, శానిటరీ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

Read Previous

మొక్కుబడిగా విధులు నిర్వహిస్తే కఠిన చర్యలు : హెచ్చరించిన కలెక్టర్

Read Next

నెల్లూరుజిల్లా పోలీసులకు అవార్డులు : అందజేసిన మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.