కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీవారు : కోలాటమాడి ఆకట్టుకున్న ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో 4వ రోజైన శుక్రవారం రాత్రి సహస్ర దీపాలంకార సేవలో కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామివారి వైభవాన్ని దర్శించి తన్మయత్వం చెందారు. చల్లటి సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారు ఉల్లాసంగా ఊయలలో ఊగుతూ భక్తులను కనువిందు చేశారు. నిత్యం అవిశ్రాంతంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించే స్వామివారు సహస్రదీపాలంకార సేవతో సేద తీరారు. ముందుగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఆ తరువాత టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భువనేశ్వరి, సరస్వతీ ప్రసాద్, కళ్యాణ్ కుమార్ అన్నమయ్య సంకీర్తనలు, పురందరదాస కీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఇందులో ‘ తిరుపతి వెంకటరమణ….., బంధనేని రంగ బంధనేని, ముద్దుగారే యశోద…., అలరచంచలమైన ఆత్మలందుండనీ అలవాటుజేసెనీ ఉయ్యాల…,’ తదితర కీర్తనలున్నాయి. ఆ తరువాత మంగళవాయిద్యంతో వాద్యనీరాజనం సమర్పించారు.

సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వేదిక చుట్టూ స్వామివారు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహించారు. రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు ఏకాంతసేవ జరిగింది. మరో వైపు వీధి ఉత్సవంలో టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్ష్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోలాటం ఆడి అందర్నీ ఆకట్టుకున్నారు.

Read Previous

శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

Read Next

స్పందనలో అర్జీలు స్వీకరించిన కమిషనర్ హరిత : సిబ్బందిపై ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published.