Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సచివాలయ వ్యవస్థ సేవలను అర్హులైన వారందరికీ విస్తృతంగా అందజేయాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ హరిత పేర్కొన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని సచివాలయాల పనితీరు పర్యవేక్షణలో భాగంగా స్థానిక 51/1, 51/2, 44/1′ 44/2 కార్యాలయాలను కమిషనర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా సచివాలయాల్లో రికార్డులు, సిబ్బంది హాజరు, తదితర అంశాలను పరిశీలించి కార్యదర్శులతో మాట్లాడారు. వివిధ విభాగాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయాలని ఆమె సూచించారు. నవరత్నాలు పధకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న పేదవారికి త్వరితగతిన స్వంత ఇంటిని అందజేసేలా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని కమిషనర్ ఆదేశించారు.
