- దేశంలోనే తొలిసారిగా 93ఏళ్ల రోగికి అవేక్ కరోటిడ్ ఎండార్టెరెక్టమీ
- ఘనత వహించిన చెన్నై అపోలో హాస్పిటల్ వైద్యులు
- మెదడు స్ట్రోక్‌ను నివారించడంలో విజయవంతంగా చికిత్స
Clock Of Nellore ( Chennai ) – చెన్నై అపోలో సూపర్ స్పెషాలిటీ వైద్యులు మరో ఘనత సాధించారు ( Chennai Apollo Hospital ). మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి, బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీసే పరిస్థితుల్లో 93ఏళ్ల వృద్ధుడికి అవేక్ కరోటిడ్ ఎండార్టెరెక్టమీ విజయవంతంగా నిర్వహించారు. 93ఏళ్ల వృద్ధుడికి ఈ తరహా చికిత్స అందించడం దేశంలోనే తొలిసారి. ఈ సందర్భంగా చెన్నై అపోలో హాస్పిటల్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీనియర్ వాస్కులర్, ఎండో వాస్కులర్ సర్జన్ డా.వి.బాలాజీ మాట్లాడుతూ… మెదడుకు వెళ్లే రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకిని క్లియర్ చేయడం ద్వారా స్ట్రోక్‌ను నివారించవచ్చని అన్నారు. ఈ ప్రక్రియను కరోటిడ్ ఎండార్టెరెక్టమీ అంటారని తెలిపారు. ప్రస్తుతం 93ఏళ్ల వృద్ధుడికి ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించామని, అతని ప్రాణాలను కాపాడమని తెలిపారు. గత ఇరవై ఏళ్లలో 700 కంటే ఎక్కువ ఈ తరహా చికిత్సలను అందించినట్లు తెలిపారు. అయితే దేశంలోనే 93ఏళ్ల వృద్ధుడికి ఈ అవేక్ కరోటిడ్ ఎండార్టెరెక్టమీ నిర్వహించడం తొలిసారి అని అన్నారు. చెన్నై అపోలో హాస్పిటల్స్‌లో నిర్వహించే ఈ తరహా చికిత్సలు 99శాతం సక్సెస్ రేట్ ఉందని, దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. ఈ తరహా మెదడు సమస్యలు ఉన్నవారికి ఓ వైపు తిమ్మిర్లు, కండరాల బలహీనత, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది. మైకము, వంటి లక్షణాలు ఉంటాయని అన్నారు. ఇటువంటి వారికి 6నెల్లలో స్ట్రోక్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందని, వీరు లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే కరోటిడ్ ఎండార్టెరెక్టమీని నిర్వహిస్తారని అన్నారు.
అనంతరం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్ సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రతి 20 సెకన్లకు భారతదేశంలో ఒకరు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారని, ప్రస్తుత జీవన శైలి కారణంగా వీరి సంఖ్య ఆందోళన కరంగా పెరుగుతుందని అన్నారు. స్ట్రోక్‌కు గురైన వారు సకాలంలో హాస్పిటల్‌కు చేరుకోలేక ప్రాణాలు వదలాల్సి వస్తుందని, స్ట్రోక్‌కు సంబంధించిన లక్షణాలను ముందుగానే గుర్తించి, వైద్యులను సంప్రదించడం వల్ల తమ ప్రాణాలను కాపాడుకున్నవారవుతారని తెలిపారు. చెన్నై అపోలో హాస్పిటల్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించి అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.