Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో రౌడీ షీటర్ ను దారుణంగా హత్య చేశారు సన్నిహితంగా ఉండే వ్యక్తులు. వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. నెల్లూరు 13వ డివిజన్ పరిధిలోని మిట్టపాళెంలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ హత్య జరిగింది. మిట్టపాళెంకు చెందిన దాసి సునీల్ అలియాస్ అలీ అనే యువకుడిపై గతంలో అనేక కేసులు ఉన్నాయి. నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్ లో అతనిపై రౌడీ షీట్ కూడా నమోదై ఉంది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి అలీ మద్యం సేవించినట్లు తెలిసింది. అర్ధరాత్రి దాటాక అతనితో సన్నిహితంగా ఉంటూనే ఆ ఇద్దరు వ్యక్తులు కత్తితో అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. శుక్రవారం ఉదయం మిట్టపాళెం చెట్ల పొదల మధ్య సునీల్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిజిహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.