Clock Of Nellore ( Nellore ) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు పధకంలో భాగంగా పేదలందరికీ శాశ్వత గృహాలను మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అక్కచెరువు పాడు, కొండ్లపూడి, వావిలేటి పాడు ప్రాంతాల్లో జరుగుతున్న జగనన్న కాలనీలు, టిడ్కో గృహ నిర్మాణ పనులను అధికారులతో కలిసి కమిషనర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికీ శాశ్వత గృహ హక్కు పధకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, గృహాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరితగతిన అందజేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంపత్ కుమార్, చంద్రయ్య, హౌసింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
