Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరుజిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. అనేక పోలింగ్ బూత్ లను ఆయన స్వయంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సంగం మండలం, గాంధీ జన సంఘంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ బూత్ లను పరిశీలించిన కలెక్టర్ అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్దుల కోసం ఏర్పాటు చేసిన ట్రై సైకిళ్లను పరిశీలించారు. వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. దువ్వూరు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటర్లతో మాట్లాడారు. సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మర్రిపాడు మండలం, డిసి పల్లి లోని రెండు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఆయా కేంద్రాల్లోని రిజిస్టర్ లను, ఓటర్ స్లిప్పులను పరిశీలించారు. పోలింగ్ సరళిని పిఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరుకు చేరుకున్న కలెక్టర్ కలెక్టరేట్ లోని తిక్కన భవన్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయనతో పాటూ జిల్లా ఎస్పీ విజయరావు, ఎన్నికల పరిశీలకులు సురేష్ కుమార్ కూడా ఉన్నారు.
