Clock Of Nellore ( Nellore ) – ప్రతి ఒక్కరికీ ఇల్లు అన్న ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో గృహాల కేటాయింపులో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి పేర్కొన్నారు. నగరంలోని బాలాజీ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి గృహాలు అందజేయడమే లక్ష్యంగా అన్ని విభాగాల అధికారులు కృషి చేయాలని తెలిపారు. ప్రతీ రోజూ కనీసం రెండు వందలకు పైగా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ల ద్వారా స్వంత ఇంటిని అందించేలా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని రిజిస్ట్రేషన్ సిబ్బందికి కమిషనర్ సూచించారు.

సచివాలయ కార్యదర్శులపై ఆగ్రహం…
స్థానిక 33/1 నేతాజీ నగర్, 33/2 వెంగళ రావు నగర్ సచివాలయాలను కమిషనర్ జాహ్నవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూనిఫామ్ వేసుకోకుండా విధులకు హాజరైన సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వివిధ విభాగాల కార్యదర్శులు అందరితో మాట్లాడి పలు రికార్డులను కమిషనర్ పరిశీలించారు. శానిటేషన్ కార్యదర్శులు యూజర్ ఛార్జ్ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హౌసింగ్ విభాగపు పనులను వేగవంతం చేయాలని అమెనిటీ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు.
