Clock Of Nellore ( Nellore ) – గుండెపోటుకు గురై చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( MLA Kotam Reddy ) త్వరగా కోలుకోవాలని కోరుతూ నెల్లూరు నగర మేయర్ స్రవంతి, వైసీపి నేత జయవర్ధన్ శనివారం సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. 12 వ డివిజన్ లోని వావిలేటిపాడు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో, చింతారెడ్డి పాలెం చర్చ్ లలో మేయర్ సర్వమత ప్రార్ధనలు నిర్వహించి కోటంరెడ్డి శ్రీధర్ ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మేయర్ స్రవంతి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి మూడు విడతల్లో నియోజకవర్గంలోని గడప గడపకు తిరిగి, ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా లేదా అని, ప్రతి ఇంటికి అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
అదే విధంగా నిన్న ఆమంచర్ల గ్రామంలో ప్రతి ఇంటి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారు యోగక్షేమాల గురించి తెలుసుకునే సమయంలో కొద్దిగా అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన నెల్లూరు అపోలో హాస్పిటల్ కు తరలించడం జరిగిందని తెలిపారు. తదుపరి ప్రాథమిక చికిత్స పూర్తి కావడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారని మేయర్ వెల్లడించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ 12వ డివిజన్ వావిలేటిపాడు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంతోపాటు, చింతా రెడ్డిపాలెం చర్చ్ లలో సర్వమత ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. నెల్లూరు ప్రజల ఆశీస్సులతో త్వరగా కోలుకుని నెల్లూరు ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టి ప్రతి ఇంటికి గడపగడపకు అడుగు పెట్టాలని ప్రజల గుండె చప్పుడు వినాలని ప్రార్థనలు చేశామని మేయర్ పేర్కొన్నారు.