Clock Of Nellore ( Nellore ) – గత 47 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో నిర్విగ్నంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇవాళ సాయంత్రం గుండెపోటు వచ్చింది. ఛాతిలో నొప్పి రావడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, కుటుంబసభ్యుల సహాయంతో హుటాహుటిన సమీపంలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ముందస్తు చర్యల్లో భాగంగా చెన్నై అపోలో హాస్పిటల్ కు తరలిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకూ ఆమంచర్ల గ్రామంలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడే స్థానికులతో కలిసి భోజనం కూడా చేశారు. అయితే ఆమంచర్ల పర్యటనలో ఉన్నప్పుడు స్వల్పంగా ఛాతిలో నొప్పి రాగా ఆయన పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఆయన్ను నిలువరించి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో ఆయన నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కు సమీపంలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. విశ్రాంతి తీసుకునే క్రమంలో ఛాతి నొప్పి అధికం కావడంతో వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు సమీపంలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. అపోలో హాస్పిటల్ లో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను చెన్నై అపోలో హాస్పిటల్ కు తరలిస్తున్నారు. సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆయనతో ఉన్నారు. మరో వైపు విషయం తెలుసుకున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అపోలో హాస్పిటల్ కు చేరుకున్నారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాట్లాడారు. ఏం కాదని ధైర్యం చెప్పారు.
