Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సెక్యూరిటీ గార్డు, స్వీపర్ వైద్యం అందించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అధ్యాపకుడు రామకృష్ణారావును ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా ఆ సమయంలో వైద్యులెవ్వరూ లేకపోవడంతో… అక్కడే ఉన్న స్వీపర్, సెక్యూరిటీ గార్డులు వైద్యం మొదలు పెట్టారు. వారే కట్లు కట్టారు. సెలైన్ కూడా పెట్టారు. అనంతరం అక్కడకు వచ్చిన డ్యూటీ డాక్టర్ సరిగా చూడకుండానే పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే నెల్లూరుకు తరలించాలని చెప్పి వెళ్లిపోయారు, బందువులు రామకృష్ణను అంబులెన్స్ లో ఎక్కిస్తుండగా సెక్యూరిటీ గార్డు కట్టిన కట్లు ఊడిపోయాయి. చివరకు నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అధ్యాపకుడు మృతి చెందారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం వల్లే రామకృష్ణ చనిపోయాడని ఆయన కుటుంబీకులు ఆరోపించారు.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ విచారణకు ఆదేశించారు. దీనిపై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల కో – ఆర్డినేటర్ రమేష్ నాథ విచారణ జరిపి చర్యలు చేపట్టారు. వైద్యం చేసిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, స్వీపర్ ను విధుల నుండి తొలగించారు. అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, డ్యూటీ డాక్టర్ గా ఉన్న మరో మహిళకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.