Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యులు, సిబ్బంది హాజరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మువ్వా తిరుమల కృష్ణ బాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ నివాస్ తో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు నెల్లూరు నుండి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, వైద్యాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు, సిబ్బంది హాజరు నమోదుకు బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేయాలని, సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్, ఇతర పరికరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆస్పత్రులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఎక్కడ లోటులేకుండా సకాలంలో సమకూర్చుకోవాలన్నారు.

45వ రౌండ్ ఫీవర్ సర్వే త్వరితగతిన చేపట్టి వ్యాధుల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, 12 – 14 మధ్య వయస్సు గల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పక అమలు చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కోవిడ్ బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ మృతులకు సంబంధించిన నష్ట పరిహారం వారి కుటుంబాలకు త్వరగా మంజూరు చేయాలని కోరారు. కోవిడ్ సమయంలో ఖర్చుపెట్టిన అన్ని బిల్లులను కూడా ప్రభుత్వానికి సమర్పించామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఫీవర్ సర్వే పకడ్బందీగా చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ సెక్రెటరీకి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెంచలయ్య, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మురళీ కృష్ణ, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ రాధా కృష్ణ రాజు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.