మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ – చిత్తూరుకు తరలింపు

Clock Of Nellore ( Hydarabad ) – నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం హైదారాబాద్‌లో ఉన్న నారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆ తర్వాత అరెస్టు చేసినట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారంలో ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. హైదరాబాద్‌లో కారులో వెళ్తున్న నారాయణ దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి సొంత కారులోనే ఏపీకి తరలించారు.

నారాయణపై పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్ ప్రాక్టీస్ చట్టం, సెక్షన్‌ 5, 8, 10 ఏపీ పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ చట్టంతో పాటు 408, 409, 201, 120 (బి), 65 ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. చిత్తూరు జ్యుడీషియల్ కోర్టులో పోలీసులు నారాయణను హాజరుపరచనున్నారు. అనంతరం ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించనున్నారు.

గతంలో ఎప్పుడూ లేనంతంగా పదోతరగతి ప్రశ్నాపత్రాలు వరుసగా లీకేజీకావడంతో ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడిపోయింది. తొలుత విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ అసలు ప్రశ్నాపత్రాలే లీకవ్వలేదంటూ తేల్చిచెప్పారు. ఇదంతా తెలుగుదేశం చేస్తున్న విషప్రచారమంటూ మండిపడ్డారు. ఆ తర్వాత సీఎం జగన్ తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల్లోనే ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నారాయణను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే పేపర్‌ లీకేజీ, మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో దాదాపు 50 మందికి పైగానే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం విశేషం. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి చిత్తూరు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో నారాయణ స్కూలు వైస్‌ ప్రిన్సిపల్ గిరిధర్‌తోపాటు పలువురిని అరెస్ట్‌ చేశారు.

Read Previous

నెల్లూరుజిల్లాలో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు – మహిళ మృతి, 20 మందికి గాయాలు

Read Next

వైద్యం చేసిన స్వీపర్లు, సెక్యూరిటీ… లెక్చరర్ మృతి… విచారణకు మంత్రి ఆదేశం

Leave a Reply

Your email address will not be published.