Clock Of Nellore ( Nellore ) – దేవస్థానాల దర్శన విషయాల్లో అందరూ సమానమేనని స్పష్టం చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఉగాది సందర్భంగా ఆయన నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లారు. సాధారణ క్యూలో అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం భక్తులతో మాట్లాడగా పలు ఫిర్యాదులు చేశారు. అర్చనలు, హారతి సమయాల్లో గర్భగుడిలో అర్చకులు కాకుండా ఇతరులు కూడా ఉంటున్నారని ఆ సమయంలో అమ్మవారి దర్శనానికి ఆటంకం కలుగుతుందని చెప్పారు. దీంతో ఆలయ సిబ్బందిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులను క్యూలైన్ల ఉంచి మీరెలా లోపల గర్భ గుడిలో ఉంటారని ఆలయ కమిటి సభ్యులు, అధికారులను నిలదీశారు. అర్చనలు, హారతి సమయాల్లో ఎవ్వరైనా బయట ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. చివరకు తాను వచ్చినా బయటే నిలబెట్టాలన్నారు. మరో సారి భక్తులకు అసౌకర్యం కలిగే చర్యలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే హెచ్చరికలతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.