Clock Of Nellore ( Nellore ) – విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరులో జనసేన పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు సిటీ నియోజకవర్గం నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో వేరు వేరుగా ధర్నా కార్యక్రమాలు జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేపట్టి అనంతరం ధర్నా చేపట్టి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఎన్నికలకు ముందు బాదుడే బాదుడు అన్న ముఖ్యమంత్రి నేడు దాన్ని సాకారం చేస్తూ బాదుడు ముఖ్యమంత్రిగా మారారని విమర్శించారు. తక్షణం పెంచిన ఛార్జీలను ఉప సంహరించుకోవాలని లేదంటే జనసేన ఆందోళనలు ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.
