కోర్టు దిక్కరణ పిటిషన్లపై కలెక్టర్ సమీక్ష… అధికారుల తీరుపై ఆగ్రహం

Clock Of Nellore ( Nellore ) – కోర్టు కేసుల పట్ల తక్షణమే స్పందించి కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు జిల్లా అధికారులను హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో కోర్టు కేసుల పరిష్కారంపై సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖలలో 686 కేసులకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా వాటిని తప్పనిసరిగా అమలు చేయడం గాని, అప్పీలుకు వెళ్లడం గాని చేయకపోవడం సరైంది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిలో ప్రధానంగా రెవెన్యూ శాఖలో 262, పంచాయతీరాజ్ శాఖలో 144, జలవనరుల శాఖలో 55, భూసేకరణలో 26, తెలుగుగంగ ప్రాజెక్టులో 36 కేసులు ఉన్నాయన్నారు.

జిల్లాలో 112 కోర్టు ధిక్కరణ కేసులు ఉండగా అందులో 98 కేసులకు సంబంధించి కౌంటర్ ఫైళ్లు దాఖలు చేశారని మిగిలిన 14 కేసులకు వెంటనే కౌంటర్ ఫైళ్లు దాఖలు చేయాలని సూచించారు. కోర్టు కేసుల పట్ల అధికారులు తీవ్రమైన విషయంగా పరిగణించాలని, నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎవరైనా కోర్టులో కేసు వేయగానే నంబర్ అయిన వెంటనే కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని లేనిపక్షంలో సంబంధిత అధికారుల పైన క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కోర్టు కేసుకు సంబంధించి వారి పరిధిలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటే వెంటనే పరిష్కరించి కోర్టుకు తెలియజేయాలని లేనిపక్షంలో పరిష్కారం కోసం సంబంధిత ఉన్నతాధికారికి వెంటనే తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో ఏ మాత్రం ఆశ్రద్ధ వహించ రాదని స్పష్టం చేశారు.

ఇకపై కోవిడ్ కారణంగా ఆలస్యం అవుతుందని చేయలేకపోతున్నామని కారణాలు తెలపడానికి వీలు లేదని సూచించారు. ఎవరైనా వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం దరఖాస్తులు చేసుకుంటే అర్హత ఉంటే వారికి సకాలంలో మంజూరు చేయాలని లేనిపక్షంలో సరైన కారణాలు వారికి తెలియజేయాలన్నారు. మరీ ముఖ్యంగా కోర్టు ధిక్కరణ కేసుల పట్ల చాలా జాగ్రత్త వహించాలన్నారు. సకాలంలో స్పందిస్తే కోర్టు ధిక్కరణ వరకు పోయే అవకాశం ఉండదని సూచించారు. కోర్టు ధిక్కరణ జరిగితే ఆర్నెల్ల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. వచ్చేవారం మరలా సమీక్షించడం జరుగుతుందని ఆలోగా బాధ్యత వహించి ప్రతి కోర్టు కేసుకు కొంత సమయం కేటాయించి కౌంటర్లు దాఖలు చేయడమా, అప్పీలుకు వెళ్లడమా సకాలంలో చేయాలన్నారు. కోర్టు కేసులు పరిష్కారం కూడా ఉద్యోగ విధుల్లో భాగమేనన్నారు. కలెక్టరేట్లోని జిల్లా న్యాయ విభాగం అధికారులు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కోర్టు కేసులు సరైన పద్ధతిలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

Read Previous

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి దంపతులు…

Read Next

ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటనకు ఏర్పాట్లు – పరిశీలించిన మంత్రి అనీల్

Leave a Reply

Your email address will not be published.