Clock Of Nellore ( Rapur ) – నియోజకవర్గాల పునర్విభజనలో రాపూరు నియోజకవర్గాన్ని పోగొట్టుకుని మోసపోయాం… మరో సారి జిల్లా విభజనలో మోసపోవడానికి సిద్ధంగా లేం… పోరాడతాం… నెల్లూరులో కలిపే వరకూ అలుపెరుగని పోరు సలుపుతాం… అంటూ నిరాహార దీక్షకు పూనుకున్నారు… నెల్లూరుజిల్లాలోని రాపూరు మండల ప్రజా ప్రతినిధులు, ప్రజలు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను శ్రీబాలాజీ జిల్లాలో కలపడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 11 రోజుల పాటూ జరిపే నిరాహార దీక్షకు గురువారం శ్రీకారం చుట్టారు. బుధవారం మూడు మండలాల ప్రజా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును కలిసి వినతి పత్రం సమర్పించిన మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి వీరి దీక్షకు సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామనారాయణరెడ్డి అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. జిల్లాల విభజన వల్ల మూడు మండలాలకు జరిగే నష్టాన్ని తెలిపేందుకే దీక్ష చేపట్టినట్లు స్పష్టం చేశారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తే పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందన్న సిఎం నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు శ్రీ బాలాజీ జిల్లాలో కలపడం ద్వారా చాలా మేర నష్టం ఉందని చెప్పారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో స్వార్ధ రాజకీయం కోసం అప్పటి కాంగ్రెస్ లోని ఓ పెద్ద మనిషి రాపూరుకు ద్రోహం చేస్తూ నియోజకవర్గాన్నే తొలగింపజేశారని అన్నారు. మరో సారి మోసపోయేందుకు ప్రజలు సిద్దంగా లేరని స్పష్టం చేశారు. 6 దశాబ్ధాల పాటూ ఆనం కుటుంబాన్ని ఆదరించిన రాపూరుకు ద్రోహం జరగనివ్వనని ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు.

రాపూరు, సైదాపురం, కలువాయిని బాలాజీ జిల్లాలో కలపడం వల్ల నీటి వివాదాలు తలెత్తే అవకాశముందన్నారు. సోమశిల, కండలేరు జలాల కేటాయింపులు జరపకుండా ఎలా విభజిస్తారని అధికారులను ప్రశ్నించారు. సిఎం ఆలోచనలకు అనుగుణంగా విభజన జరగలేదని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామని చెప్పారు… మరి తిరుపతి పార్లమెంటులోని సర్వేపల్లిని నెల్లూరులో ఎలా కలిపారని… అధికారులు దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఈ మూడు మండలాలను కూడా నెల్లూరులో ఎందుకు కలపరో చెప్పాలని ఆనం డిమాండ్ చేశారు. అధికారులు చేసిన తప్పిదాలను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం జరిగిన విభజన ప్రకారం సోమశిల జలాశయం సగం నెల్లూరుజిల్లా, మరో సగం శ్రీ బాలాజీ జిల్లాలో ఉందన్నారు. సోమశిల నుంచి నియోజకవర్గాలకు నీటి కేటాయింపులు జరపకుండా విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇదే మాదిరిగా కొనసాగితే రెండు జిల్లాల మధ్య నీటి యుద్ధాలు జరిగే పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. ప్రజాభీష్ఠం తెలుసుకోకుండా విభజన చేస్తే మనుగత ప్రశ్నార్ధకంగా మారుతుందని, 11 రోజుల పాటూ తాను ఆమరణ నిరాహార దీక్ష చేసి కండలేరు జలాలను సాధించానని ఆనం గుర్తు చేశారు. మూడు జిల్లాలను నెల్లూరులో కలిపేందుకు అవసరమేతే పోరాటానికి సిద్ధమని ఆనం ప్రకటించారు.