Clock Of Nellore ( Nellore ) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపిగా ఇవాళ నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి నెల్లూరుజిల్లా వాసులకు సుపరిచిడుడే. దాదాపు రెండేళ్ల పాటూ ఆయన నెల్లూరుజిల్లా ఎస్పీగా పనిచేశారు. 1992 బ్యాచ్ చెందిన కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి నెల్లూరుజిల్లా ఎస్పీగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఫైర్ బ్రాండ్ ఎస్పీగా పేరుతెచ్చుకున్న కొత్తకోట శ్రీనివాసులు రెడ్డికి ఏ మాత్రం తగ్గకుండా తాను కూడా ఫైర్ బ్రాండ్ అని పేరుతెచ్చుకున్నారు. మృదు స్వభావి అయిన రాజేంద్రనాథ్ రెడ్డి… విధుల్లో మాత్రం కఠినంగా వ్యవహరించే వారు. నేరస్తులకు వణుకు పుట్టించే విధంగా నెల్లూరుజిల్లాలో ఓ వ్యక్తిని ఎన్ కౌంటర్ కూడా చేశాడు.
2003లో అప్పటి జిల్లా ఎస్పీ కొత్తకోట శ్రీనివాసులురెడ్డి బదలీ తర్వాత ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి 2004 లో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ జిల్లాలోనే ఉన్నారు. అనేక దోపిడీలు, చోరీ కేసులను ఛేదించారు. ఆ రోజుల్లో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఆ ముఠాపై ప్రత్యేక దృష్ఠి సారించిన రాజేంద్రనాథ్ రెడ్డి తనదైన శైలిలో దర్యాప్తు నిర్వహించి ముఠా గుట్టును రట్టు చేసి వారిని జైలుకు పంపారు. అంతే కాదు ఆ ముఠాలోని ప్రధాన నిందితుణ్ని జిల్లాలోని వాసిలి ప్రాంతంలో ఎన్ కౌంటర్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్ఠించారు. జిల్లాలోని పోలీసుల సంక్షేమానికి విశేష కృషి చేసి జిల్లా పోలీసు శాఖలో మన్ననలు పొందారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎంతో సమర్ధవంతంగా పనిచేసి పేరుతెచ్చుకున్నారు. 2004 ఎన్నికల తర్వాత ఆయన బదిలీపై వెళ్లారు. జిల్లాలో ఆయనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయన్ను రాష్ట్ర డీజీపిగా ప్రభుత్వం నియమించడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయనతో కలిసి పనిచేసిన పోలీసులు ఆనంద పడుతున్నారు.
