Clock Of Nellore ( Sriharikota ) – నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోక కేంద్రం నుండి ఇస్రో సోమవారం ఉదయం చేపట్టనున్న పిఎస్ఎల్వీ – సి 52 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 4 గంటలా 29 నిముషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 25 గంటల 30 నిముషాల సుదీర్ఘ కౌంట్ డౌన్ అనంతరం సోమవారం ఉదయం 5 గంటలా 59 నిముషాలకు షార్ లోని మొదటి ల్యాంచ్ ప్యాడ్ నుండి పిఎస్ఎల్వీ రాకెట్ నిప్పులు చిమ్ముతూ గగనతలంలోకి ప్రవేశించనుంది. ఈ రాకెట్ ద్వారా రెండు చిన్న ఉప గ్రహాలతో పాటూ 1710 కిలోల బరువైన మరో ఉప గ్రహాన్ని భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఈ రాకెట్ ద్వారా ఇస్రో ఈఓఎస్ – 04 అనే 1710 కిలోల బరువైన రాడార్ ఇమేజ్ శాటిలైట్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ శాటిలైట్ ద్వారా వ్యవసాయం, అటవీ, ప్లాంటేషన్, మట్టి నమూనాలు, ఫ్లడ్ మ్యాపింగ్ సేవలను పొందనున్నారు. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటూ సేవలు అందించనుంది. ఈ ఉపగ్రహంతో పాటూ మరో రెండు బుల్లి ఉపగ్రహాలు కూడా నింగిలోకి పంపనున్నారు. భారత్ – భూటన్ సంయుక్తంగా తయారు చేసిన 17.5 కిలోల బరువైన ఐఎన్ఎస్ – 2 టిడి అనే టెక్నాలజీ డెమానుస్ట్రేషన్ ఉప గ్రహం కూడా భూ స్థిర కక్ష్యలోకి చేరనుంది. 6 నెలల పాటూ ఈ ఉప గ్రహం సేవలు అందించనుంది. వీటితో పాటూ ఇన్ స్పైర్ శాట్ అనే ఉప గ్రహం కూడా కక్ష్యలోకి చేరనుంది. ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసిన ఈ ఉప గ్రహం బరువు 8.1 కిలోలు. ఒక సంవత్సరం పాటూ ఇది సేవలు అందించనుంది.