Clock Of Nellore ( Amaravathi ) – రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఉద్యోగుల పిఆర్సీ వివాదం సద్దు మణిగింది. మంత్రుల కమిటీలో ఉద్యోగ జేఏసి నేతల సుదీర్ఘ భేటీల అనంతరం ప్రభుత్వ ప్రతిపాదనలను జేఏసి నేతలు అంగీకరించి ఆదివారం ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యి సమ్మెను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మీదని ఉద్యోగ సంఘాల నేతలతో అన్నారు. మీ సహకారంతోనే ప్రజలకు మంచి చేయగలుగుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, కరోనా వల్ల ఉద్యోగులు ఆశించినంత ఇవ్వలేకపోవచ్చుని, ఎంత మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశామన్నారు. రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుందన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు తావు ఉండకూడదన్నారు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్ కమిటీ కూడా ఉందని, ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చునని సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలతో అన్నారు. ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చునన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుందని, ఉద్యోగుల ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.