ఆయుష్, న్యాయశాఖ ఖాళీల భర్తీపై కేంద్రాన్ని ప్రశ్నించిన నెల్లూరు ఎంపి ఆదాల

Clock Of Nellore ( Delhi ) – వృద్ధుల జనాభా కోసం ఆయుష్ తీసుకున్న చర్యలు ఏమిటని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ దేశంలో కోవిడ్ – 19 మహమ్మారి తర్వాత వృద్ధుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులకు ఆయుష్ ప్రొఫైలాక్టివ్ మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆయుర్వేదంతో సహా ఆయుష్ వ్యవస్థల నుంచి కోవిడ్ – 19 నివారణకు రోగనిరోధక మందులు సాధారణ ప్రజలకు సైతం సిద్ధ, యునాని, హోమియోపతి మందులు ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ప్రచారం కింద 2022 ఫిబ్రవరి వరకు ఏపీలో 1,03,758 మందికి మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా వీటిని పంపిణీ చేసినట్లు తెలిపారు. వీటితో పాటు హ్యాండ్ వాష్, మాస్క్, ఈటీ వంటి పరిశుభ్రతతో పాటు సాధారణ గృహ చికిత్సలను, రోగనిరోధకశక్తిని పెంచే చర్యలను కూడా సూచించినట్లు పేర్కొన్నారు. దేశంలోని మెడికల్, పారామెడికల్ సిబ్బందితో సహా అందుబాటులో ఉన్న మౌలిక సౌకర్యాలను ఉపయోగించుకునేందుకు అన్ని రకాల వైద్య కళాశాలలకు లేఖలు రాసినట్లు తెలిపారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ ఇనిస్టిట్యూట్ లను క్వారంటైన్ సెంటర్లు గా కూడా ఉపయోగించాయని పేర్కొన్నారు. దేశంలోని ప్రఖ్యాత పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పాలీ హెర్బల్ ఫార్ములేషన్ అయిన ఆయుష్-64 ఉపయోగపడుతుందని కనుగొన్నారని తెలిపారు. కోవిడ్ రోగుల కోసం సిద్ధ తయారీ అయినా కబాసుర్ కుడినీర్ కూడా చక్కగా పనిచేస్తున్నట్లు, దీన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు.

అలాగే కేంద్ర న్యాయశాఖ విభాగంలో ఖాళీల భర్తీకి ఏం చర్యలు తీసుకున్నారని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ ఖాళీలు దాదాపు 50 శాతం ఉన్నట్లు సమాచారం అందిందని, అది నిజమేనా అని కూడా అడిగారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు దీనికి రాతపూర్వకంగా సమాధానమిస్తూ ప్రస్తుతం న్యాయశాఖ లో461 పోస్టులకుగాను దాదాపు 171 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇవి మొత్తం ఖాళీల్లో 37. 09 శాతం అని పేర్కొన్నారు. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

Read Previous

గూడూరును నెల్లూరుజిల్లాలోనే కొనసాగించండి… నిరసన తెలిపిన ప్రజలు

Read Next

మెరుగు పేరుతో బంగారంతో ఉడాయింపు… నాయుడుపేటలో సంఘటన

Leave a Reply

Your email address will not be published.